ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతున్నాయి. జీపీఎఫ్ కింద తాము పొదుపు చేసుకున్న సొమ్ములు రావడానికి ఆలస్యం అవుతున్నాయి. రిటైరైన బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు. జనవరి నెల పెన్షన్లు ఫిబ్రవరిలో వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఎన్నో సమస్యలు. వాటి గురించి తీవ్రమైన ఒత్తిడి వస్తూండే సరికి… చర్చిద్దామంటూ ఉద్యోగ సంఘప్రతినిధులను ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, సీఎం తర్వాత సీఎం బాధ్యతలు నిర్వహించే సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించారు. అయితే ఆ సమయంలో జరిగింది మాత్రం ఉద్యోగుల కష్టాల గురించి కాదు. తమ ఉద్యోగ సంఘాల గురించి. వైసీపీ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘం నేతగా వెలిగిపోతున్న వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి అనే ఉద్యోగ సంఘాల నేతలతో పాటు మరికొంత మంది సమావేశాలకు హాజరయ్యారు.
పెన్షన్లు ఇంత వరకూ ఇవ్వడానికి కారణాలేమిటో వారు మొదటగా ప్రభుత్వం నుంచి వివరణ రాబట్టలేకపోయారు. రిటైరైన వారికి బెనిఫిట్స్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యమవుతుందో ప్రశ్నించలేదు. కానీ… ఒక శాఖకు ఒక ఉద్యోగ సంఘమే ఉండాలన్న ఓ ఉద్యోగ సంఘ నేత ప్రతిపాదన చేయడంతో రచ్చ రచ్చ చేసుకున్నారు. ఉద్యోగ సంఘాలు ఎన్ని ఉంటాయన్నది తర్వాతి విషయం… ముందుగా సమావేశ అజెండా ఉద్యోగుల కష్టాలను తీర్చమని ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం. అదేమీ చేయకుండా… ఒక్క సంఘం మాత్రమే ఉండాలన్నట్లుగా ఒకరు మాట్లాడటం.. దానికి ఇతరులు చెలరేగిపోవడం… మొత్తంగా సమావేశం రసాభాస అవడం జరిగిపోయాయి.
చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి వారికి సర్ది చెప్పి సమావేశం ముగిసిందని అనిపించారు. అయితే.. సమావేశం అజెండాలోని అంశాల గురించి ఏమీచెప్పకపోతే బాగుండదని అనుకున్నారేమో కానీ… సీఎంఎఫ్ ఎస్ విధానం వల్ల సమస్యలు వస్తున్నాయని పరిష్కరిస్తామని చెప్పి పంపారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి అందడం లేదు. చాలా మంది పెన్షనర్లకు.. జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరిలో వచ్చింది. ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి.. ఊరట కల్పించేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాల్సింది పోయి… తమ సంఘాల పై పట్టు కోసం వారంతా… ఉద్యోగుల ప్రయోజనాలను లైట్ తీసుకుంటున్నారు.