హైదరాబాద్‌లో కొద్ది రోజుల కిందట ప్రవీణ్ రావు అనే వ్యక్తితో పాటు అతని సోదరులు ఇద్దరిని భూ వివాదాలతో ఆంధ్రాకు చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ వర్గీయులు కిడ్నాప్ చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అఘమేఘాలపై స్పందించి.. కాల్ డేటాలు తీసి.. జీపీఎస్ ద్వారా కార్ ట్రాకింగ్‌లు చేసి… గంటల్లోనే ఇంకా చెప్పాలంటే నిమిషాల్లోనే వారిని విడిపించగలిగారు. ప్రధాన నిందితులుగా చెబుతున్న వారిని పోలీసులు ఇప్పటి వరకూ పట్టుకోలేకపోయారు. అయితే వ్యూహాత్మకంగానే పట్టుకోలేదన్న ప్రచారం కూడా ఉంది. ఆ కేసులో బ్యాక్ గ్రౌండ్లో కనిపించేవారిని అరెస్ట్ చేసి.. పోలీస్ కమిషనర్లు మ్యాప్‌లు గీచి మరీ ఎలా జరిగిందో వివరించారు. ఆ కేసుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.
ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో వామనరావు అనే లాయర్ హత్య జరిగింది. లాయర్‌తో పాటు ఆయన సతీమణిని కూడా దారుణంగా నరికిచంపారు. ఆడవాళ్లపై చేయి ఎత్తడానికే సిగ్గుపడే సమాజం మనది. అలాంటి… ఏకంగా వేటకొడవళ్లతో నరికేశారంటే అదెంత క్రూరత్వమో అర్థం చేసుకోవచ్చు. అయితే పోలీసులు కనీసం కిడ్నాప్ కేసు రేంజ్లో అయినా స్పందించారా అంటే అందులో కనీసం పదోవంతు కూడా లేదన్న అభిప్రాయాలు.. విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. పట్టపగలు జరిగిన హత్య ఘటన గురించి తెలిసిన తర్వాత .. పోలీసు ఉన్నతాధికారులెవరూ సంఘటనా స్థలానికి వెళ్లలేదు. సాక్ష్యాలను కాపాడే ప్రయత్నం చేయలేదు. అంతే కాదు… నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. పక్కా వీడియో సాక్ష్యాలు దొరకడంతో తప్పనిసరిగా కొంతమందిని అరెస్ట్ చూపిస్తున్నారు. కానీ మీడియా ముందు ప్రవేశ పెట్టలేదు.
వామనరావు హత్యకేసులో పోలీసులు తప్ప.. అందరూ అనుకుంటున్న పేరు పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు పేరు. ఆయన ప్రమేయం లేకుండా కుంట శ్రీను అయినా బిట్టు శ్రీను అయినా… హత్యలు చేసేంత స్థాయికి వెళ్లరని అందరికీ తెలుసని అంటున్నారు. అయితే.. పుట్ట మధు పేరుమాత్రం పోలీసులు ఎక్కడా ప్రస్తావించడం లేదు. తెర వెనుక ఎవరున్నారో దర్యాప్తుచేస్తామని చెబుతున్నారు. ఇలాంటి కేసులు ఎంత ఆలస్యం అయితే నిందితులు అంత త్వరగా ఎస్కేప్ అవుతారు. ఇప్పుడు జరుగుతోంది అదే. తెలంగాణ సర్కార్ కు కూడా ఈ అంశంలో చెడ్డ పేరు వస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కూడా.. చట్ట ప్రకారం కాకుండా… రాజకీయాల ప్రకారం నడుచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.