సినిమా అంటే రీ క్రియేషన్స్. లేనివి ఉన్నట్టు చూపించాలి. ఉన్నవి ఇంకా అందంగా చూపించాలి. ఇప్పటి కట్టడాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో కూడా చూపించాలి. సృష్టికి ప్రతి సృష్టి జరగాలి. పవన్ కల్యాణ్ సినిమా కోసం అదే జరుగుతోంది.
పవన్- క్రిష్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ముగిసింది. వచ్చేవారం మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం మరో పది రోజుల డేట్లు ఇచ్చాడు పవన్. ఈ పది రోజుల్లో… కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించడానికి క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం గండి కోట సెట్ ని రాజీవన్ నేతృత్వంలో డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం… చార్మినార్ సెట్ కూడా వేసిన సంగతి తెలిసిందే.చార్మినార్ ఒక్కటే కాదు.. హైదరాబాద్ లో ఉన్న చారిత్రాత్మక కట్టడాలన్నీ..ఈ సినిమా కోసం సెట్స్ రూపంలో మళ్లీ నిర్మించబోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే… ఒకప్పటి భాగ్యనరగరానికి పునసృష్టి చేస్తున్నారు. 17వ శతాబ్దం నాటి కథ ఇది. భాగ్యనగర నేపథ్యంలో సాగుతుంది. అప్పట్లో హైదరాబాద్ ఎలా ఉందో, అప్పటి కట్టడాలు ఎలా ఉండేవో… కసరత్తు చేసి, వాటికి తగినట్టుగానే సెట్స్ నిర్మించి.. చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ అయ్యాక.. ఈ సినిమాలో పవన్ లుక్‌ని బయటకు తీసుకొస్తారని సమాచారం. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.