ఐతే…తో చిన్న సినిమాలకు ఓ సరికొత్త దారి చూపించిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. సినిమా అంటే కమర్షియల్ యాంగిల్. అందుకోసం ఏవో జిమ్మిక్కులు చేయాలి. కానీ ఎప్పుడూ వాటి గురించి ఆలోచించకుండా నిజాయతీగా తన పని తాను చేసుకుపోతున్నాడు. అందుకే.. ఓ వర్గం ప్రేక్షకులు చందూ సినిమాల కోసం ఇప్పటికీ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడాయన `చెక్` అంటూ మరో ప్రయత్నం చేశారు. నితిన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్ర శేఖర్ ఏలేటితో చిట్ చాట్.
* చాలా గ్యాప్ వచ్చినట్టుంది?
– నేనెప్పుడూ అంతే నండీ. నేనే కాదు… సరైన సక్సెస్ లేకపోతే.. ఎవరికైనా ఇలానే గ్యాప్ వస్తుంటుంది. అయితే ఈ గ్యాప్ లో నేనేం ఖాళీగా లేను. రెండు మూడు కథలు సిద్ధం చేసుకున్నా. అయితే ఏ కథ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పలేం. దానికే ఆసల్యం అవుతూ ఉంటుంది.
* ‘చెక్’ ఐడియా ఎప్పుడు వచ్చింది?
– ఎవరికీ లేని గొప్ప టాలెంట్ ఉన్న మనిషి… తన కోసం అన్వేషణ జరుగుతుంటే? ఎక్కడ ఉంటే? అని ఓ ఐడియా ఎప్పటి నుంచో ఉంది. ఓ పది పదిహేను ఏళ్లుగా నాలో ఉంది. అది రకరకాలుగా మారి ‘చెక్’లా తయారైంది. అంటే… ఐడియా లెవల్ లో ఉన్నది ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఉండదు. కథపై చాలా రీసెర్చ్ చేశా.
* ఎలాంటి కథలు ఎంచుకున్నా.. అందులో స్క్రీన్ ప్లే గమ్మత్తులు ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. మరి ఈ సినిమాలో..?
– ‘చెక్’లోనూ స్క్రీన్-ప్లే అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో హీరో ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ, బాగా తెలివైన వ్యక్తి. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో జైలులో పడితే ఉరిశిక్ష పడిపోతుంది. ఇప్పుడు నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడ తన తెలివితేటల్ని సరైన దారిలో ఉపయోగించుకునే అవకాశం వస్తే ఏం చేశాడన్నదే కథ.
*కథలో చదరంగం ఆటకు ఎంత ప్రాముఖ్యం ఉంది?*
– చాలా ఉంది. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి చివరి అవకాశం.. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం. అది అందరికీ సులభంగా దొరకదు. హీరో.. చెస్ ప్లేయర్ కాబట్టి, అతను అన్ని పోటీల్లోనూ వరుసగా గెలుస్తుంటే తనపై ఓ సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. రాష్ట్రపతి దగ్గర అభిప్రాయం మారవచ్చు. ఆట, క్షమాభిక్ష… ఈ రెండు అంశాల నేపథ్యంలో సన్నివేశాలు ఉంటాయి.
*సినిమాలో ఎక్కువశాతం జైలు నేపథ్యంలో ఉంటుందట. దానిని ఎలా డీల్ చేశారు?
– 70 శాతం సినిమా జైలులో సాగుతుంది. నిజానికి స్క్రిప్టు ప్రకారం ఇంకా తక్కువే ఉండాలి. కానీ కరోనా వల్ల బయటకు వెళ్లలేక జైలు సీక్వెన్సులు కొంచెం పెంచాల్సి వచ్చింది.
* నితిన్ ని ఎంచుకోవాడానికి కారణం ఏంటి?
– ఎంచుకోవడం కాదు… నితిన్ తో సినిమా చేయాలని అనుకున్నాం. అప్పుడు రెండుమూడు కథలు అనుకున్నాం. దీనికి ముందు ఇంకో కథపై వర్కవుట్ చేశాం. ఫైనల్ గా ఈ కథ బావుంటుందని అనుకుని ‘చెక్’ చేశాం.
*నితిన్ ని మైండ్ లో పెట్టుకుని కథ రాశారా? కథ ప్రిపేర్ అయ్యాక నితిన్ ని కలిశారా?
– ప్రిపేర్ అయ్యాక కలిశా. అయితే, అప్పటికే నితిన్ తో చేయాలని ఉంది. నితిన్ కి బాగా సూట్ అవుతుందని అనిపించింది.
* కల్యాణీ మాలిక్ గారిని తీసుకోవడానికి కారణం?
-‘ఐతే’ తర్వాత గ్యాప్ కూడా వచ్చింది. – ఎప్పటి నుంచో మేమిద్దరం చేయాలని అనుకుంటున్నాం. మధ్య మధ్యలో కలిశాం. పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇన్ని రోజుల తర్వాత కుదిరింది. అదృష్టం అనుకోవాలి. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు.
*ప్రచార చిత్రాల్లో రకుల్ ప్రీత్ సింగ్ ను న్యాయవాదిగా చూపించారు. తన పాత్ర ఎలా ఉండబోతోంది?
– అమ్మాయిది న్యాయవాది పాత్రే. కాకపోతే… బేసిగ్గా భయస్తురాలు. భయస్తురాలు నుంచి ధైర్యవంతురాలిగా మారుతుంది. క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అటువంటి అమ్మాయి తీవ్రవాది ముద్రపడిన ఓ వ్యక్తి కేసు డీల్ చేయాల్సి వస్తుంది. ఆమెది మంచి రోల్.
* మరి ప్రియా ప్రకాశ్ వారియర్?
– ఆ పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. ఆ అమ్మాయిదీ చాలా ఇంపార్టెంట్ రోల్. నితిన్ లవ్ ఇంట్రెస్ట్. ఆమె ఎంటర్ అయిన దగ్గర్నుంచి మొత్తం కథ టర్న్ తీసుకుంటుంది.
* జైలు నేపథ్యం, అక్కడి వాతావరణం తెలుసుకునే ప్రయత్నం చేశారా?
– చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు ఓ ఏడాది పాటు అన్ని జైళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని ప్రయత్నించాం. హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి వస్తాయి కనుక చూడటానికి అనుమతులు ఇవ్వడం లేదు. జైలులో విధానాలపై మేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. అంటే… తీవ్రవాదులను ఎలా తీసుకువెళతారు? ఎలా పెడతారు? వంటి విషయాలు చెప్పడానికి ఓపెన్ గా లేరు. కాన్ఫిడెన్షియల్ మేటర్ కాబట్టి అర్థం చేసుకోగలను. అందుకని, ఓ జైలును కల్పించాం. ఫరీద్ కోట్ నుండి విశాఖ వరకు ఐదారు జైళ్లకు వెళ్ళా. సాధారణ ఖైదీలను చూపిస్తున్నారు. అక్కడ నుంచి ముందుకు వెళ్లడం లేదు. పేర్లు అప్రస్తుతం గానీ… కొంతమంది ఖైదీలను ఎక్కడ పెట్టారు? ఎటువంటి భోజనం ఇస్తున్నారు? అని ప్రశ్నిస్తే సమాధానాలు రాలేదు.
* మీ కథలపై ఎలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది?
– ఇవాళ ఉదయం పేపర్లో ఒక ఆర్టికల్ చదివి ఉండొచ్చు. అది మనసులో ముద్రపడి రెండు సంవత్సరాల తర్వాత మారిపోయి వేరే ఐడియాగా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్… ‘ఐతే’ సినిమాకి అమెరికా ప్రభుత్వ ప్రకటన ఒకటి స్ఫూర్తి. ఒసామా బిన్ లాడెన్ మీద 100 మిలియన్ డాలర్ ప్రైజ్ మనీ ఏదో పెట్టారు. అక్కడ నుంచి ఐడియా ట్రిగ్గర్ అయింది. శూన్యం నుంచి ఎవరికీ ఐడియాలు రావు. కొత్తగా ఏదీ సృష్టించలేం. సృష్టించాల్సింది అంతా భగవంతుడు ఎప్పుడో సృష్టించాడు. ఐడియా ఎవరు ట్రిగ్గర్ చేస్తారనేది చెప్పలేం.
*ప్రేక్షకుల ఆలోచనల కంటే మీరు అడ్వాన్స్డ్ గా ఉంటారు. అందుకే మీ కథలు త్వరగా అర్థం కావు… అంటుంటారు. ఈ విమర్శ గమనించారా?
– అలాగని చాలామంది అంటారు. నా సినిమాలు విడుదలైన రెండు మూడేళ్ల తర్వాత ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది. ‘సినిమాలో అది బావుంది’ అని చెప్తారు. అడ్వాన్స్డ్ అవ్వడం కూడా తప్పే. కాలం కంటే ముందు, వెనుక ప్రయాణించకూడదు. కాలంతో పాటు ప్రయాణించాలి.
*నెక్స్ట్ సినిమా?
– ఈ సినిమాకి ముందే రెండు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒకటి, వేరేసినిమా ఇంకొకటి చేయాలి.