ఐపీఎల్ టోర్నీలో ఆయా నగరాల పేరుతో జట్లను నడుపుకుంటున్న జట్లు స్థానిక ఆటగాళ్లకు కనీసం రిజర్వ్ బెంచ్‌లలో కూడా చోటు ఇవ్వకపోవడంపై అక్కడక్కడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ విషయంలో ఈ అసంతృప్తి బహిరంగమవుతోంది. మాజీ మంత్రి దానం నాగేందర్ తొలి సారి గళం విప్పారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో పాతిక మంది ఆటగాళ్లు ఉంటే అందులో హైదరాబాద్ ఆటగాళ్లు ఒక్కరు కూడా లేరని.. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహించాలని ఆయన డిమండ్ చేస్తున్నారు. దానం నాగేందర్ తన వ్యాఖ్యలకు హైదరాబాద్ సెంటిమెంట్ కూడా జోడిస్తున్నారు. అంతే కాదు… టీం యాజమాన్యంతో పాటు కెప్టెన్ పైనా మండిపడుతున్నారు. డెవిడ్ వార్నర్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్. వార్నర్ ఫిక్సింగ్‌లో దొరికిన ఆటగాడని.. అలాంటి ఆటగాడ్ని పెట్టుకుని హైదరబాద్ టీంను నడుపుతున్నారని మండిపడుతున్నారు.
హైదరాబాద్ ఆటగాళ్లకు జరుగుతున్న అన్యాయంపై యాజమాన్యం స్పందించాలని లేకపోతే…. జట్టు పేరులో హైదరాబాద్ లేకుండా తీసేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అంతకు ముందు హైదరాబాద్ జట్టు డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి చేతుల్లో ఉండేది. డెక్కన్ చార్జర్స్ పేరుతో టీముని నడిపేవారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్న వారంతా… ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగిపోతే… వెంకట్రామిరెడ్డి మాత్రం అధఃపాతాళానికి దిగిపోయారు. తన ఇతర ఆస్తులన్నీ పోగొట్టుకోగా.. చివరికి డెక్కన్ చార్జర్స్‌ను కూడా మోయలేనంతగా మార్చుకున్నారు. చివరికి ఆ ఫ్రాంచైజీని క్యాన్సిల్ చేశారు. ఈ సారి హైదరాబాద్ సంస్థలు దక్కించుకోలేకపోయారు. తమిళనాడు బడా వ్యాపారవేత్తలు.. సన్ నెట్ వర్క్ ఓనర్లయిన మారన్ సోదరుల చేతికి హైదరాబాద్ ఫ్రాంచైజీ వెళ్లింది. అప్పట్నుంచి తమిళ వాసనే కనిపిస్తోంది.
హైదరాబాద్ ఆటగాళ్లను పెద్దగా పట్టించుకోవడం లేదు హైదరాబాద్ స్థానికంగా ఉన్న ఆటగాళ్లను ఇతర టీములు కొనుగోలు చేసుకున్నాయి. లేకపోతే లేదు. కనీసం బేస్ ప్రైస్‌కి కూడా ఇక్కడ ఒకరిద్దర్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ అసంతృప్తి ఇప్పుడు బయటపడుతోంది. దానం నాగేందర్ అంటే సాదా సీదా వ్యక్తి కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యే. కానీ స్పందించడానికి సన్ రైజర్స్ టీం వద్ద పెద్దగా స్టఫ్ లేదు… హైదరాబాద్ ప్లేయర్స్ లేరు. గతంలో వీవీఎస్ లక్ష్మణ్ లాంటి వాళ్లు ఉండేవారు. మొదట గ్రౌండ్లో తర్వాత తెర వెనుక సాయం అందించారు. ఇప్పుడు అలాంటిసాయాలు కూడా.. హైదరాబాద్ ప్లేయర్ల నుంచి సన్ రైజర్స్ పొందడం లేదు.