ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ తీయడంలో… మలయాళం వాళ్లు మనకంటే ముందే ఉన్నారు. ఓరకంగా దేశానికి వాళ్లే దిక్చూచీ. అప్పటి దృశ్యం నుంచీ.. ఇప్పటి దృశ్యమ్ 2 వరకూ అందుకు ఎన్నో ఉదాహరణలు. గమనించాల్సిన విషయం ఏమిటంటే… ప్రజాదరణ పొందిన ఆ థ్రిల్లర్స్ అన్నీ అతి తక్కువ బడ్జెట్ తో తీసినవే. స్టార్స్ లేరు. హంగామా లేదు. కేవలం థ్రిల్లింగ్, ఇన్వెస్టిగేషన్ మాత్రమే ఉంది. ఇటీవల మలయాళంలో విడుదలైన చిత్రం `అంజామ్ పథిరా`. మలయాళ హిట్ చిత్రాల్ని డబ్ చేసి, అందించడమే పనిగా పెట్టుకున్న `ఆహా` ఈ సినిమాని `మిడ్ నైట్ మర్డర్స్` పేరుతో తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి… ఇందులో ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? థ్రిల్ ఎంత?
కేరళలోని ఓ నగరంలో… సీనియర్ పోలీస్ ఆఫీసర్ల కిడ్నాప్ జరుగుతుంటుంది. వరుసగా పోలీస్ ఆఫీసర్లు మాయం అవుతుంటారు. మరుసటి రోజు శవాలు దొరుకుతుంటాయి. వాళ్ల కళ్లనీ, గుండెల్నీ పీకేసి… సజీవంగా ఉన్నప్పుడే.. కిరాతంగా హత్య చేస్తుంటారు. హత్యకు సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకదు. కేవలం కళ్లు తెరచుకుని చూస్తున్న న్యాయ దేవత ప్రతిమ మాత్రమే దొరుకుతుంటుంది. ఈ కేసు.. పోలీసులకు పెద్ద సవాలుగా మారుతుంది. దాన్ని పోలీసులు ఎలా ఛేదించారు? ఈ కేసులో అన్వర్ (కుంకచో బోనన్) అనే సైకాలజిస్ట్ పాత్రేమిటి? అనేది తెరపై చూడాలి.
మలయాళ థ్రిల్లర్స్ ప్రత్యేకత ఏమిటంటే… వాళ్లు కేవలం కథ మాత్రమే చెబుతారు. నేరుగా కథలోకి వెళ్లిపోయి.. కథతోనే ప్రయాణం చేస్తారు. అనవసరమైన హంగామా ఉండదు. పాటలు అస్సలే కనిపించవు. `మిడ్ నైట్ మర్డర్స్`లోనూ అదే చూస్తాం. పోలీసులు వరుసగా హత్యకు గురవ్వడం… ఆ కేసుని సీరియస్ గా తీసుకోవడం, అన్వర్ హుస్సేన్… పోలీసులకు టిప్స్ అందించడం… ఇలా టేకాఫ్ లోనే సినిమా స్పీడందుకుంటుంది. సీసీ టీవీ ఫుటేజీ కి దొరక్కుండా హత్యలు చేయడం, పోలీసుల కంప్యూటర్లనే హ్యాక్ చేయడం… చూస్తే.. ప్రత్యర్థి ఓ తెలివైన హంతకుడు అనిపిస్తుంది. ఇలాంటి కేసుల్ని డీల్ చేయడం.. సవాలే. కాకపోతే.. ఓ చిన్న క్లూ.. అసలు నేరస్థుడు దొరకడానికి మార్గం వేస్తుంది. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చక చక సాగుతుంది. నేరస్థుడు దొరికిపోయాడే… అనుకుంటాం. కానీ దొరకడు. అంచెలంచెలుగా కేసు చిక్కుముడి విప్పుకుంటూ పోయాడు. చివరికి అసలు నేరస్థుడు దొరికేసిన తరవాత.. కూడా కథని నడిపాడు. దాంతో.. ఆ తరవాత సన్నివేశాలు భారంగా కదులుతుంటాయి. సినిమా అయిపోయిన తరవాత కూడా ఈ కథని ఎందుకు నడుపుతున్నాడా? అనే అనుమానం వేస్తుంది. చివర్లో మరో హత్యతో కథని ముగించి… చక్కటి ముగింపు ఇచ్చాడు దర్శకుడు.
ఇలాంటి కథల్లో ఎదురయ్యే ఇబ్బంది.. సెకండాఫ్ సిండ్రోమ్. `మిడ్ నైట్ మర్డర్స్` కూడా దాటుకు రాలేకపోయింది. ప్రతీ సైకో నేరస్థుడికీ ఓ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇందులోనూ అది ఉంది. ఆ కథకి ఎక్కువ సమయం వెచ్చించాడు దర్శకుడు.ఎంత సైకాలజిస్ట్ అయినా, ఇన్వెస్టిగేషన్ అంతా తనొక్కడిపైనే వదిలేసినట్టు… అన్వర్ టిప్ ఇచ్చేంత వరకూ స్వతహాగా ఆలోచించరు పోలీసులు. అదో పెద్ద మైనస్.
ఇందులో ఏ ఒక్కరినీ హీరో అనలేం. కేవలం కథని నడిపించే పాత్రలు గానే పరిగణించాలి. ఏ పాత్రకు ఎవరిని ఎంచుకోవాలి? వాళ్లతో ఎలాంటి నటన రాబట్టాలి? అనే విషయంలో దర్శకుడికి స్పష్టత ఉంది. అందుకే… అన్ని పాత్రలూ పర్ఫెక్ట్గా కుదిరాయి. టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. కెమెరా, సంగీతం… మూడ్‌ని ఇంకాస్త గాఢంగా చూపించాయి. ఎడిటింగ్ సెకండాఫ్‌లో షార్ప్‌గా ఉండాల్సింది. కథని మొదలెట్టిన విధానం, ట్విస్టులు అన్నీ బాగున్నాయి. కానీ… బ్యాక్ స్టోరీ మాత్రం పరమ రొటీన్ గా ఉంది. ఇక్కడే కొన్ని సినిమాలు దొరికిపోతున్నాయి. అసలు సైకో హంతకుడికి ఓ బ్యాక్ స్టోరీ ఉండాలన్న సూత్రాన్ని దర్శకులు, రచయితలు కొంతకాలం పక్కన పెడితే బాగుంటుందేమో..?