స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాయలేదని వైసీపీ నేతలు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. లేఖ రాస్తే జైల్లో పెడతారని భయమా.. అని ప్రశ్నించారు. తమ నేత లేఖ రాశారని కూడా గుర్తు చేశారు. అయితే చంద్రబాబు వాళ్ల మాటలను పట్టించుకున్నారో లేక వ్యూహాత్మకంగా కొద్ది రోజులు ఆలస్యం చేశారో కానీ ఆదివారం ప్రధాని మోడీకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని లేఖ పంపేశారు. అందులో… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఏం చేయాలో కొన్ని సూచనలు చేశారు. వాజ్ పేయి హయాంలో.. ఇలానే స్టీల్ ప్లాంట్ కు ఇబ్బందికర పరిస్థితులు వస్తే అప్పట్లో… కేంద్రం ..దాదాపుగా పదమూడు వందల కోట్లు కేటాయించి.. కాపాడిందని.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పనిచేయాలని చంద్రబాబు కోరారు.
చంద్రబాబు లేఖ రాయడం అన్నది చాలా కామన్. కానీ ఆ విషయాన్ని ఉమ్మడి రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వడం అన్నంతగా వైసీపీ సీన్ క్రియేట్ చేసింది. దానికి తగ్గట్లుగా ఆయన ఆగి ఆగి లేఖ రాశారు. ఇప్పుడు.. వైసీపీ నేతలకు విమర్శించడానికి ఏమీ లేకుండా పోతుంది. ఇప్పుడు టీడీపీ నేతలు అధికార పార్టీ హోదాలో.. గతంలో ప్రత్యేకహోదా కోసం టీడీపీ పోరాడినట్లుగా వైసీపీ నేతలు పోరాడాలని సవాల్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడం… ప్రధాని ఇంటిని ముట్టడించడం వంటివి చేయాలని సవాల్ చేస్తున్నారు. కానీ.. వైసీపీ నేతలు మాత్రం.. నోరు మెదిపే పరిస్థితి లేదు. వారు విశాఖలోనే పాదయాత్రల్లో పాల్గొంటున్నారు. అవి కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పాదయాత్రల్లానే ఉన్నాయి కానీ… స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్నట్లుగా లేవు.
నిజానికి లేఖలు.. అసెంబ్లీ తీర్మానాల వల్ల పావలా ప్రయోజనం కూడా ఉండదని రాజకీయవర్గాలకు తెలుసు. కార్మిక సంఘాలతో సమావేశమైనప్పుడు సీఎం జగన్ కూడా… తాను లేఖ రాసి… ఫిఫ్టీన్ డేస్ అంటే పదిరోజులు గడిచినప్పటికీ.. ఎలాంటి రిప్లై రాలేదని చెప్పుకొచ్చి ఆవేదన చెందారు. ఇదంతా చంద్రబాబు మొదటి ఐదేళ్లు అనుభవించారు కాబట్టి రిప్లయ్ వస్తుందని కూడా ఆయన అనుకోరు. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయాలు చేస్తూ.. అన్ని పార్టీలు టైం పాస్ చేస్తున్నాయి కానీ.. చిత్తశుద్ధితో… ఉద్యమాలు మాత్రం చేయడం లేదన్న అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది.