తెలుగు మీడియా రంగంలో పెట్టుబడులు పెట్టి రాజకీయంగా పలుకుబడి సంపాదించుకుందామని వచ్చేస్తున్న వారందరికీ… చేతి చమురు బాగానే వదులుతోంది. ఏంచేయాలో తెలియక చానెళ్లను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సిక్స్ టీవీ, ఏపీ24/7 లాంటి చానళ్ల ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వంతు ప్రైమ్ 9 న్యూస్ వంతు వచ్చింది. ఆ చానళ్ల ప్రసారాలు పూర్తిగా ఆగిపోయాయి. శాటిలైట్ ప్రసారాలు ఇవ్వాలంటే.. ఎర్త్ స్టేషన్ ఉన్న వారితో ఒప్పందం చేసుకోవాలి . అలా చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకపోవడంతో వారు ప్రసారాలు నిలిపివేశారు.
ప్రైమ్ 9 న్యూస్ చానల్ అనేదాన్ని మొదట… జనసేనకు మద్దతుగా అంటూ ప్రారంభించారు. తర్వాత వైసీపీకి మద్దతుగా టోన్ మార్చారు. కానీ ఆ చానల్‌ను పట్టించుకున్న వారెవరూలేరు. మొదట్లో వైసీపీ భజన పరుడిగా పేరున్న జర్నలిస్ట్ సాయి ఈ చానల్లో కీలక పాత్ర పోషించారు. తర్వాత ఏం జరిగిందో కానీ ఆయన ఉన్నాడో లేదో తెలీనట్లుగా బండి నడుస్తోంది. సాయి సొంత చానల్ పెట్టుకుని ప్రభుత్వాన్ని పొగుడుతూ.. విపక్షాల్ని విమర్శిస్తూ.. వీడియోలు చేసుకుంటున్నారు.కానీ ప్రైమ్ 9న్యూస్ మాత్రం రోజు రోజుకు దిగజారిపోయింది.
బాబి ఆనంద్ అనే వ్యక్తి ఇప్పటి వరకూ సీఓఓగా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలో చానల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెబుతున్నారు. డబ్బులు తీసుకుని రిపోర్టర్ ఉద్యోగాలు ఇచ్చేవారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడుచానల్ ప్రసారాలు నిలిపివేయడంతో పెట్టుబడి పెట్టిన వారు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. వైసీపీకి మద్దుతుగా ఉంటున్నందున ఆ పార్టీకి చెందిన ఎవరినైనా బిగ్ షాట్‌ను పట్టుకుని బండి నడిపించాలన్న ఆలోచన చేస్తున్నారు. దానికి సాయి కరెక్టని అతన్నే అప్రోచ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న చానల్స్ నిలబడినట్లుగా చరిత్రలో లేదు కాబట్టి.. ప్రైమ్ 9 న్యూస్ కూడా… అత్యాశపరుల చేతుల్లో నలికిపోయిందని అనుకోవచ్చు.