ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాతృభాషా గొప్పతనాన్ని ఆయన కొన్ని మాటల్లో వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక.. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష అని జగన్ ఆ ట్వీట్లో స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యతని గుర్తు చేశారు. మాతృభాషకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది. నిజానికి ఆయన మంచి మాటలు చెప్పారు. తెలుగును కాపాడుకోవాలని ఉన్న వారందరికీ ఇది నచ్చింది. కానీ.. జగన్ సర్కార్ తీసుకున్న .. తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రమే… ఈ ట్వీట్ విశ్వసయనీతను ప్రశ్నిస్తున్నాయని అంటున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు తెలుగు మీడియం లేకుండా చేయాలని నిర్ణయించారు. తెలుగు మీడియా ఎక్కడా లేకుండా చేయడం ఏ విధంగా మాతృభాషను రక్షించడం అవుతుందన్న సందేహాలు చాలా మందికి వచ్చాయి. ఈ నిర్ణయం తీవ్ర విమర్శల పాలయింది. జాతీయ.. అంతర్జాతీయ నిపుణులు సైతం..ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరిగితే మానసిక వికాసం పెరుగుతుందని పరిశోధించి మరీ వెల్లడించారు. అయితే … ఉద్యోగాలు రాకపోవడానికి ఇంగ్లిషే కారణమని సీఎం భావించి.. ఆ ఉద్యోగాలు రావాలంటే అందరికీ ఇంగ్లిష్ రావాలని తెలుగు భాషను తొలగించాలని నిర్ణయించారు.
చివరికి ఈ నిర్ణయం కోర్టుల్లో నిలబడలేదు. రాజ్యాంగ పరంగా కూడా చెల్లలేదు. అదే సమయంలో కేంద్రం తీసుకు వచ్చిన కొత్త చట్టం కూడా.. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని చెబుతోంది. అయినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తగ్గాలనుకోవడం లేదు వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఇంగ్లిష్ మీడియం మాత్రమే అమలు చేస్తామన్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. అందుకే ఇప్పుడు సీఎం చేసిన ట్వీట్‌ను అందరూ వైరల్ చేసి.. తీసుకుంటున్న నిర్ణయాలకు.. చేస్తున్న ప్రకటనలకు సంబంధం లేదన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.