మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవీని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేయడం… పోటీకి ఆమె అంగీకరించడం తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. నిజానికి ఆమెను ఎమ్మెల్యేల కోటాలో నామినేట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పెద్దగా ఆశల్లేని హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అభ్యర్థిగా నిలబెట్టారు. సురభి వాణిదేవి… రాజకీయాల్లో లేరు. ఆమె విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. అయితే పీవీ నరసింహారావుకు ఎక్కడా లేనంత గౌరవం ఇవ్వాలని నిర్ణయించిన కేసీఆర్.. శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాల కమిటీలో సురభి వాణిదేవికి కీలక స్థానం ఇచ్చారు. అంతే కాదు… పీవీకి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఓ వర్గాన్ని అమితంగా ఆకట్టుకోవచ్చన్నలక్ష్యంతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఆమె కుమార్తెకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. గత ఆగస్టులో గవర్నర్ కోటాలో మూడు స్థానాలు భర్తీ చేశారు. అప్పట్లోనే పీవీ కుమార్తె పేరును టీఆర్ఎస్ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగాపోటీకి నిలబెట్టారు. ఇది పీవీ అభిమానుల్ని కూడా షాక్కు గురి చేస్తోంది.
ఉద్యమ వేడి ఉన్నప్పుడే… ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ను ఉద్యోగానికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా పోటీ చేయించారు. కానీ అక్కడ ఓడిపోయారు. అలాంటిది.. ఇప్పుడు వాణిదేవిని ఎందుకు నిలెబట్టాల్సి వచ్చిందనేది వారి సందేహం. పైగా హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి చిన్నారెడ్డి, ఎల్ రమణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి హేమాహేలు పోటీ చేస్తున్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. ఓటింగ్ ప్రయారిటీల్లో పార్టీలు ఉండవు. అయినప్పటికీ కేసీఆర్ వ్యూహాత్మకంగా పీవీ కుమార్తెను రంగంలోకి దింపారు.