మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న ఎస్ఈసీ ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తి చేస్తారని అందరూ అనుకున్నారు. ఇటీవల ఆ ఎన్నికకు సంబంధించి ఓ సర్క్యూలర్ కూడా విడుదల చేశారు. బలవంతపు ఏకగ్రీవాల విషయంలో ఫిర్యాదులు చేయాలని సూచనలు చేశారు. అలాంటి వాటిపై విచారణ కూడా చేయించాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం ఈ అంశంపై కోర్టుకు వెళ్లింది. ఏకగ్రీవాలు అయిన చోట… విచారణ జరపకూడదని కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల అధికారులు ఫామ్ -10 ఇచ్చి ఉంటే వాటిపై విచారణ వద్దని ఆదేశించింది.
అయితే ఇవి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే… మళ్లీ విచారణ సమయంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి తుది ఉత్తర్వులు ఇస్తారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వివరాలను మీడియాకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టిన నిమ్మగడ్డ… పరిషత్ ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నట్లుగా మాట్లాడారు. న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని.. అవి పూర్తయిన తర్వాతనే ఆలోచిస్తామన్నారు. లేకపోతే.. వాయిదా వేస్తామన్నట్లుగా ఆయన సమాధానం ఉంది.
పంచాయతీల్లో మొత్తంగా స్వీప్ చేసేశామని చెబుతున్న ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలపై విచారణ జరిపితే ఉలిక్కి పడటం.. విపక్షాల విమర్శలకు కారణం అవుతోంది. బలవంతపు ఏకగ్రీవాలు కాకపోతే.. ఎందుకు కంగారు పడతారని ప్రశ్నిస్తోంది. పరిస్థితి చూస్తూంటే.. నిమ్మగడ్డ మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసి.. పరిషత్ ఎన్నికల బాధ్యతను తర్వాత కమిషనర్‌కు అప్పగించి.. రిటైర్ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు.