తొమ్మిదేళ్ల తరవాత రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్టు కొట్టాడు చిరంజీవి. ఖైదీ నెం.150తో. తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని, తానెప్పటికీ మెగాస్టారే అని ఆ సినిమా ఫలితంతో చాటి చెప్పాడు. తదుపరి వచ్చిన సైరా కలక్షన్ల పరంగా నిరాశ పరిచినా, మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది. ఇప్పుడు అందరి దృష్టీ ఆచార్యపైనే.
అయితే.. ఈ క్రమంలో కొన్ని రీమేకులకు ఓకే చెప్పాడు చిరంజీవి. లూసీఫర్, వేదాళం రీమేక్‌లను ఆయన పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పుడు మరో రీమేక్‌పై కూడా ఆయన దృష్టి సారించారని తెలుస్తోంది. తమిళంలో అజిత్ చేసిన `ఎన్నై అరిందాల్` సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నట్టు టాక్. 2015లో విడుదలైన సినిమా ఇది. తెలుగులో `ఎంత వాడు గానీ` రూపంలో డబ్ అయ్యింది. అయినా సరే, చిరు దృష్టి ఈ సినిమాపై పడడం విచిత్రంగా ఉంది. రీమేక్‌లు చేయడంలో తప్పేం లేదు. అది సేఫ్ జోనర్ కూడా. కానీ చిరంజీవి లాంటి హీరోకి తెలుగులో కథలే దొరకడం లేదా? అనిపిస్తోంది.చిరు ఇది వరకు కూడా ఇలా రీమేకులు చేసినవాడే. అయితే ఈ స్థాయిలో ఎప్పుడూ రీమేకులపై ఆధారపడిలేదు. రీ ఎంట్రీకి రీమేక్ ఎంచుకున్నాడంటే, రిస్క్ చేయడం ఎందుకు? అన్న ఫీలింగ్ లో అనుకోవొచ్చు. ఇప్పుడు పాత కథలెందుకు? అనేదే పెద్ద ప్రశ్న. ఈ వయసులో.. చిరుకి తగిన కథలు ఎవరూ రాయడం లేదా? రాసినా చిరుకి నచ్చడం లేదా? లేదా ఈ దశలో ఫ్లాపులెందుకని, సేఫ్ గేమ్ ఆడేస్తున్నాడా? చిరు ఇలానే రీమేకులకు అంకితమైపోతే, చిరు కోసం కథలు రాసే వాళ్లంతా ఏమైపోతారు? ఈ మైండ్ సెట్ నుంచి చిరు బయట పడితేనే కొత్త కథలొస్తాయన్నది ఆయన అభిమానులు అంతర్గతం.