ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ చాలా ఆతృతగా ఉందని మరోసారి స్పష్టమయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాల్న లక్ష్యంతో ఉంది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగాయి కాబట్టి సొంత ప్రకటనలే.. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అలాగే… ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో ఓ స్థానంలో జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. పవన్ కల్యాణ్ అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాదె వెంకటేశ్వరరావు అనే విద్యా రంగ ప్రముఖుడిని పవన్ కల్యాణ్ ఖరారు చేశారు.
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని అలాంటి పనుల వల్ల ఉపాధ్యాయులు.. బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారని..ఆ పరిస్థితులు మారుస్తామని పవన్ కల్యాణ్ అంటున్నారు. నిజానికి టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పోటీ చేయడం సాహసమనే చెప్పాలి. ఎందుకంటే టీచర్ల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే పోటీ చేస్తూ ఉంటాయి. రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవు. ఒక వేళ ఏదైనా రాజకీయ పార్టీ పోటీ చేసినా వారికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఇప్పుడుకూడా అంతే ఏపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల మధ్యనే పోటీ కనిపిస్తోంది.
అయితే మండలిలో పట్టు సాధించాలనుకుంటున్న సీఎం జగన్… ఈ రెండింటిలోనూ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే పరిస్థితుల్ని వివరించిన పార్టీ నేతలు పోటీ చేయకపోవడమే మంచిదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీ మాత్రం… దూకుడుగా ముందుకెళ్తోంది. తమ పార్టీ తరపున అభ్యర్థిని ఖరారు చేసింది. ఇదే దూకుడుతో పవన్ కల్యాణ్.. తిరుపతి అభ్యర్థిని కూడా ఖరారు చేయాలని జనసైనికులు కోరుతున్నారు.