కాపు ఉద్యమనేత గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరెన్నికగన్న ముద్రగడ పద్మనాభం తాజాగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. అయితే ఆయన రాసిన లేఖ పై సొంత సామాజిక వర్గ నెటిజన్ల నుండి విమర్శలు రావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే
ముద్రగడ పద్మనాభం ఈరోజు ప్రధానమంత్రికి లేఖ రాశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని దీనివల్ల మధ్యతరగతి జీవితాల్లో వెలుతురు తగ్గుతోందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. పైగా వాహనాలకు మోటార్ వెహికల్ టాక్స్ పేరు తో లక్షలాది రూపాయలు ప్రభుత్వం వసూలు చేస్తోందని, అంతేకాకుండా టోల్ గేట్లు 30 సంవత్సరాలకు లీజుకు ఇచ్చి తోలు తీసే ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఓట్లు వేసిన ప్రజల కోసం ఆలోచించాలని , ప్రజల సమస్యల కోసం రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి తీసుకు రావద్దని ఆయన కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు.
అయితే ముద్రగడ లేఖపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వ పాలనలో కాపు రిజర్వేషన్ల గురించి కాపు సంక్షేమం గురించి ముఖ్యమంత్రికి లేఖలు రాసిన ముద్రగడ, జగన్ ముఖ్యమంత్రి కాగానే కాపు ఉద్యమాన్ని పక్కన పెట్టారని ముద్రగడ పై వస్తున్న ప్రధాన విమర్శ. అయితే దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాటు పై పల్లెత్తు మాట అనకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న కారణంగా ఈయన జగన్ ని కాపాడడానికే ఇటువంటి లేఖలు రాస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకొందరైతే కనీసం కాపు కార్పొరేషన్ నిధుల గురించి గురించి ప్రభుత్వాలకు లేఖ రాసే పరిస్థితుల్లో కూడా ముద్రగడ లేకపోవడం బాధాకరం అని వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో ముద్రగడ కాపులకు రిజర్వేషన్లు కావాలంటూ బలంగా ఉద్యమం చేసిన ముద్రగడ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యమం వదిలివేయడం చూసిన తర్వాత, ముద్రగడ అప్పట్లో చేసిన ఉద్యమం మొత్తం కేవలం జగన్ ని అధికారంలోకి తీసుకు రావడం కోసమే అన్న క్లారిటీ మాత్రం ఆ సామాజిక వర్గం లో బాగా నే వచ్చినట్లు కనిపిస్తోంది.