`భక్త కన్నప్ప`ని రీమేక్ చేయాలని కృష్ణంరాజు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ పాత్రలో ప్రభాస్ ని చూసుకోవాలన్నది ఆయన ఆశ. దర్శకత్వం కూడా ఆయనే చేపట్టాలనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
`కన్నప్ప` కథని సినిమాగా తీయాలని తనికెళ్ల భరణి కూడా ఫిక్సయ్యారు. తన హీరోగా.. సునీల్ ని ఎంచుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆ తరవాతే… ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేటూ లేదు. సునీల్ కూడా డ్రాపయిపోవడంతో.. భరణి ఆ స్క్రిప్టుని పక్కన పెట్టేశారు.
భరణి దగ్గర `కన్నప్ప` స్క్రిప్టు రెడీగా ఉందని తెలుసుకున్న మోహన్ బాబు… ఆసినిమాతో విష్ణుతో చేస్తే బాగుంటుందని భావించారు. విష్ణు ఎంటర్ అయ్యాక… ఈ సినిమా బడ్జెట్ తో పాటు స్వరూప స్వభావాలన్నీ మారిపోయాయి. దాదాపు 50 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ఇంత పెద్ద సినిమా మోయడం తన వల్ల కాదని… భరణి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో.. హాలీవుడ్ నుంచి ఓ డైరెక్టర్ ని రంగంలోకి దింపాడు విష్ణు. ఆ తరవాత.. ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి సమాచారమూ లేదు.
ఇప్పుడు మళ్లీ ఈ కథని బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఈ స్క్రిప్టు ఇప్పుడు బుర్రా సాయి మాధవ్ దగ్గరకు చేరిందట. ఆయన కథలో మార్పులూ చేర్పులూ చేస్తున్నారని టాక్. ఎలాగైనా సరే.. ఈ యేడాది కన్నప్పని సెట్స్ పైకి తీసుకెళ్లాలని విష్ణు ఫిక్సయ్యాడు. మార్చి లేదా ఏప్రిల్ లో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈసారైనా… అన్నీ పక్కాగా జరుగుతాయా? మళ్లీ కన్నప్పకి బ్రేకులు పడతాయా? అన్నది ఆసక్తికరం. ఎందుకంటే.. ఈ కన్నప్ప కథ ఎప్పుడూ నలుగుతూనే ఉంటుంది తప్ప, బయటకు రాదు. ఈసారీ ప్రకటనలకే పరిమితం అయితే.. కన్నప్ప కి ఏదో బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతున్నట్టే.