పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచిన అభ్యర్థి మా వాడు అంటే మా వాడు అంటూ వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు కొనసాగుతూ ఉండటం తెలిసిందే .అయితే తాజాగా కొడాలి నాని టిడిపి, జనసేన ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
కొడాలి నాని, తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో, తన నియోజకవర్గంలోని వెణుతురుమిల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి మీద గెలిచిన అభ్యర్థి టిడిపి అభ్యర్థి కాదు అని, అక్కడ గెలిచిన అభ్యర్థి జనసేన అభ్యర్థి అని వ్యాఖ్యానించారు. టీడీపీ అనుకూల మీడియా లో కొడాలి నానికి టిడిపి అభ్యర్థులు వెణుతురుమిల్లి పంచాయతీ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. ఆయన మాట్లాడుతూ వెణుతురు మిల్లి లో టిడిపి అసలు అభ్యర్థిని నిలబెట్టలేదని, అక్కడ పోటీ జనసేనకు వైఎస్ఆర్సిపి కి మధ్యలో జరిగిందని, అయితే పవన్ ళ్యాణ్ సామాజికవర్గానికి చెందిన 500 మంది ఓటర్లు గంపగుత్తగా జనసేనకు ఓటు వేయడంతో తమ పార్టీ అభ్యర్థి స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు అని, అక్కడ స్వల్ప మెజారిటీతో గెలిచింది జనసేన అభ్యర్థి అని చెప్పుకొచ్చాడు.
అయితే సాక్షి మీడియాలో కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు టీడీపీ అనుకూల మీడియా ఇటు వైఎస్ఆర్సిపి అనుకూల మీడియా ఇద్దరు కూడా జనసేన అభ్యర్థుల విజయాలను ప్రకటించకుండా ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ నేతయే తమ పార్టీ అభ్యర్థి విజయం గురించి మాట్లాడడం జనసేన అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. అయితే అదే సమయంలో టిడిపి అభిమానులు కూడా యలమర్రు గ్రామంలో కొడాలి నానికి టిడిపి అభ్యర్థి షాక్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.