ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు సంపాదన రూ. మూడు వందల కోట్లు అని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లెక్క చెప్పారు. సీఎం జగన్ కు ఉన్న వ్యాపారాలు, సిమెంట్ ఫ్యాక్టరీ, సాక్షి, ఇతర కంపెనీల ద్వారా వచ్చే ఆదాయాన్ని జేసీ దివాకర్ రెడ్డి చెప్పలేదు. జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్న మొత్తంలో రోజుకు సీఎం జగన్ కు రూ. మూడు వందల కోట్లు ముడుతున్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. అయితే… వెంటనే ప్రభుత్వం పెట్టే కేసులు గుర్తుకు వచ్చాయేమో కానీ.. పవన్ కల్యాణ్ స్టైలో… ఈ విషయం తాను చెప్పడం లేదని.. ప్రజలే అనుకుంటున్నారని కవర్ చేసుకున్నారు. ఇటీవలి కాలంలో చాలా అరుదుగా మీడియా ముందుకు వస్తున్న జేసీ… పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
పంచాయతీ ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడానికి ఆయన సీఎం జగన్ సంపాదన అంశాన్ని ప్రస్తావించారు. డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారని .. కుప్పంను చంద్రబాబు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినా.. వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారని.. అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారనడం దొంగ మాటగా తేల్చేశారు.
వ్యక్తులు.. పాలసీల మద్య జరిగిన ఎన్నికలు కాదు… మద్యం డబ్బుకు అమ్ముడుపోతున్నాయని.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టగలరని జేసీ తేల్చారు. జేసీ దివాకర్ రెడ్డి నిజంగానే జనంలో ఉన్న మాటల్నే అన్నారో లేకపోతే… తనకు తెలిసిన సమాచారాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలనుకున్నారో కానీ.. రూ. మూడు వందల కోట్లు అంటూ.. ఓ లెక్కను ప్రజల్లోకి వదిలారు.