అగ్రవర్ణ పేదలకు ముఖ్యమంత్రి జగన్ కొత్త పథకం ప్రకటించారు. ఈబీసీ నేస్తం అని దానికి పేరు పెట్టారు. ఈ పథకం కింద అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఏటా రూ. పదిహేనువేల ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. రూ.670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేయనున్నారు. 45-60 ఏళ్ల ఈబీసీ మహిళలకు మూడేళ్లపాటు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుంది. అలాగే కేబినెట్లో నవరత్నాల అమలు క్యాలెండర్ను ఆమోదించారు. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. 23 రకాల సంక్షేమ పథకాలకు నెలవారీగా కూడా షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించారు.
ఏపీలో మొత్తంగా 5.69 కోట్ల మంది పేదలకు క్యాలెండర్ ప్రకారం పథకాలు అమలు చేస్తామని మంత్రి పేర్నినాని కేబినెట్ భేటీ తర్వతా ప్రకటించారు. జగనన్న విద్యా దీవెనలో సంపూర్ణంగా బోధనా ఫీజు చెల్లింపులు ఉంటాయన్నారు. సంక్షేమ పథకాలతో పాటు పలు కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది. అమరావతి భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకుంటున్న ఏపీ సర్కార్ ఇందు కోసం నిధులను సేకరించడానికి ఎంఆర్డీఏకు రూ.3వేల కోట్లు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అదే సమయంలో కడప స్టీల్ ప్లాంట్ కోసం మొదటి విడతలో రూ.10 వేల కోట్లు, రెండో విడతలో రూ.6వేల కోట్లు కేటాయించాలని కూడా కేబినెట్ భేటీలో నిర్ణయించారు.
ఈ ప్లాంట్ ను ప్రభుత్వమే కడుతుందా లేకపోతే.. పోస్కో కడుతుందా అన్నదానిపై కేబినెట్ భేటీలో స్పష్టత రాలేదు. అధికారులు వెళ్లిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తన సంతోషాన్ని సీఎం జగన్ మంత్రులతో పంచుకున్నారు. పంచాయతీల చరిత్రలో లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామని.. తర్వాత పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని కోరుదామని మంత్రులకు తెలిపారు. అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.