ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల్లో తనకు ఉన్న పలుకుబడిని మరోసారి ఆ స్వామిజీ నిరూపించుకున్నారన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది. విజయవాడ కనకదుర్గమ్మ అలయంలో అవినీతిపై ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు జరిపి సంచలన విషయాలు బయట పెట్టారు. అవినీతిలో కింది స్థాయి ఉద్యోగులు చేసేవి కాకుండా… పై స్థాయిలో బట్టబయలైన స్కాంలు ఎక్కువగా ఉన్నాయి. ఈవోను అరెస్ట్ చేయడం ఖాయమన్నంత తీవ్రమైన అవినీతికి ఆధారాలు బయట పడ్డాయి. కానీ సాయంత్రానికి ఈవోనే… అన్నింటికీ కింది స్థాయి ఉద్యోగుల్ని బలి చేస్తూ.. సస్పెన్షన్ ఉత్తర్వులు విడుదల చేస్తూ యాక్టివ్ గా కనిపించారు. దీంతో దుర్గగుడి ఉద్యోగులు మాత్రమే కాదు… సచివాలయంలోని కొంత మంది అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.
ఈవో నేరుగా జోక్యం చేసుకున్న అవినీతి లెక్కలు .. లెక్క లేనంతగా ఉన్నాయి. దుర్గగుడిలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్‌ను టెండర్లలో పాల్గొన్న ఎల్3కి కట్టబెట్టారు. అదే నిబంధనలకు విరుద్ధం. అయినా పొడిగించారు. ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఈ విధానపరమైన లోపాలను గుర్తించారు. ఇక ప్రైవేటు సెక్యూరిటీ కాంట్రాక్ట్ మ్యాక్స్ సంస్ధకు ఇచ్చారు. ఈ టెండర్లలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. దేవాదాయ కమిషనర్ ఈ అంశంపై నేరుగా ఈవో సురేష్ బాబుపైనే ఆరోపణలు చేశారు. అన్నదానం కోసం కొనే సరుకులు, ఇచ్చిన డొనేషన్లకు సంబంధించిన రికార్డులు సరిగా లేవు. అమ్మవారికి పెద్ద ఎత్తున చీరలు సమర్పిస్తూ ఉంటారు. ఈ చీరలు కూడా మాయమయ్యాయి. రికార్డులకు స్టాక్‌కు పొంతన లేదు. ప్రసాదాలు సహా ఏ విభాగంలోనూ స్వచ్ఛత లేదు. ఎక్కడ చూసినా అవినీతే. తమ అవినీతిలో వాటాలు ఈవో దగ్గరకు వెళ్తాయని ఆ ఉద్యోగులు బహిరంగంగానే చెప్పుకుంటూ ఉంటారు.
ఇంత జరుగుతున్నా.. ఈవోపై ఈగ వాలలేదు. అసలు బాధ్యత ఆయనదే అయితే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. అయితే ఆయన మంత్రి వెల్లంపల్లికి అత్యంత సన్నిహితుడు. ఆ కోణంలో… విశాఖలోని ఓ పీఠం నుంచి ప్రభుత్వ పెద్దలపై తీవ్ర ఒత్తిడి వచ్చిందని… అక్రమార్కులపై చర్యలు తీసుకోవద్దని.. ముఖ్యంగా ఈవో జోలికి పోవద్దని సూచించినట్లుగా చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం ఆయన అవినీతికి కూడా కింది స్థాయి ఉద్యోగుల్ని బలి చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆ స్వామిజీ ప్రభుత్వంలోతనకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నారని అంటున్నారు.