విజయనగరం జిల్లాలో వైసీపీ అంటే బొత్స సత్యనారాయణ. ఆయన గుడ్ లుక్స్‌లో ఉంటే తమకు రాజకీయ అవకాశాలు వస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు బొత్స వర్గం అని పేరు పడిన వారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వడం లేదు. పార్టీ హైకమాండ్ నుంచి అలాంటి సంకేతాలు వచ్చాయేమో కానీ.. బొత్సకు వ్యతిరేక వర్గం ఆయన కన్నా బలంగా మారిపోయింది. విజయనగరం జిల్లాలో బొత్సకు వ్యతిరేకంగా కోలగట్ల వీరభద్రస్వామి బలంగా తయారయ్యారు. విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల్లో బొత్స వర్గీయులెవరికీ ఆయన ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు. వారంతా వెళ్లి బొత్సకు మొరపెట్టుకున్నారు.
బొత్స వారిని ఇండిపెండెంట్లుగా పోటీ చేయమని సలహా ఇచ్చేశారని చెబుతున్నారు. బొత్స సలహాలతో 35 మంది విజయనగరం వైసీపీ నేతలు సమావేశమయ్యారు. బొత్స అనుచరులమని చెప్పి తమను అరిచి వేస్తున్నారని.. పార్టీని చీల్చేశారని వారు మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన తమకే టిక్కెట్లు ఇవ్వాలని లేకపోతే.. తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించారు. వ్యాపారి అయిన ఎమ్మెల్యే కోలగట్ల తన దుకాణాల్లో పని చేసిన వారికి కార్పొరేటర్ టిక్కెట్లు ఇస్తున్నారని వారంటున్నారు. మొదట నుంచి బొత్సకు విజయనగరంలో పట్టు ఉంది. బొత్స చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పటికీ..భార్యను మాత్రం విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేయించేవారు. అయితే వైసీపీలో ఆయనకు అంత ప్రాధాన్యం దక్కలేదు. ఎంపీ స్థానం ఆయన భార్యకు ఇవ్వడానికి జగన్ నిరాకరించారు.
బొత్స ప్రత్యర్థి అయిన బెల్లాన చంద్రశేఖర్‌కు ఇచ్చారు. బొత్సకు అలా ప్రత్యర్థుల్ని వైసీపీ హైకమండ్ పెంచేసింది. పై స్థాయిలోనూ పెట్టమన్నట్లుగా ప్రెస్మీట్లు పెట్టడం తప్ప బొత్స ఏమీ చేయలేకపోతున్నారు. ఫలితంగా ఆయన ప్రభావం అటు జిల్లాలోనూ ఇటు రాష్ట్రస్థాయిలోనూ తగ్గిపోతోంది. అందుకే.. వర్గాన్ని కాపాడుకోవాలంటే వారి బలాన్ని చూపించాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి విజయనగరం రాజకీయాలు .. టీడీపీ కంటే వైసీపీలోనే మరింత ఘాటుగా మారాయి.