చంద్రబాబును అడ్డుకుంటామంటూ కుప్పం వైసీపీ నేతలు కొంత మంది మీడియా ప్రకటనలు ఇవ్వడం.. వాటికి వైసీపీ అనుకూల మీడియా అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో … కుప్పంలో ఏం జరుగుతుందంటూ .. రెండు రోజుల నుంచే చర్చ ప్రారంభమయింది. మూడు రోజుల పర్యటనకు చంద్రబాబు గురువారం కుప్పం చేరుకున్నారు. విమానంలో బెంగళూరు వెళ్లి అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్నారు. అయితే అడ్డుకుంటామన్న వాళ్లెవరూ ఎక్కడా కనిపించలేదు. కానీ చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి మాత్రం దాదాపుగా రెండు వేల మంది కుప్పం, కర్ణాటక సరిహద్దుల వద్దకు వచ్చారు. దీంతో వైసీపీ నేతల ప్రకటనలన్నీ ఉత్తుత్తివిగానే తేలిపోయాయి.
కుప్పంలోకి ఎంట్రీ ఇవ్వగానే.. గ్రామ దేవతకు పూజలు చేసిన చంద్రబాబు… వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. కుప్పం ప్రజలందర్నీ భయపెట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారని… అన్ని గుర్తుపెట్టుకుంటున్నా.., వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా తిరిగిస్తానని హెచ్చరించారు. ఇంకా ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉందన్నారు. జమిలీ ఎన్నికల తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో చూస్తామన్నారు. పెద్దిరెడ్డి పేరు ఎత్తకుండా.. తాము అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు చేసినట్లుగా చేసి ఉంటే… వాళ్లెక్కడ ఉండేవాళ్లని ప్రశ్నించారు.
చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో మండలాల వారీగా పర్యటించనున్నారు. కుప్పంలో చంద్రబాబు పని అయిపోయిందని… ఆయనను అడ్డుకుంటారని ఓ వర్గం మీడియా విస్తృతంగా ప్రచారం చేసినా.. కుప్పంలో అలాంటి పరిస్థితులు కనిపించలేదు. చిత్తూరు జిల్లా నేతలపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నేతలకు.. కార్యకర్తల మధ్య సామరస్య వాతావరణం దెబ్బతిన్నది. ఈ కారణంగా పార్టీ రిపేర్ చేయడానికి చంద్రబాబుకు వెసులుబాటు దొరికినట్లయింది.