పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చచ్చిపోవడమే తప్పు. పేదరికం నుంచి పారిపోవాలంటే డబ్బు సంపాదించడం ఒక్కటే మార్గం. అయితే.. అందుకు మార్గాలేంటి? సక్రమమైన దారిలో వెళ్తే.. ఎవరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాలేరు. అందుకే.. అక్రమమైనా మరో కొత్త మార్గాన్ని అన్వేషించాలనుకున్నాడు. కటిక పేదరికం నుంచి – అపర కుబేరుడు అయిపోయాడు. చివరికి ఆ డబ్బంతా ఎక్కడ దాచుకోవాలో తెలీయనంత అయోమయంలో పడ్డాడు. ఒక్కసారిగా తను కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? అందుకు ఎంచుకున్న మార్గం ఏమిటి? అనేది `మోసగాళ్లు` చూసి తెలుసుకోవాల్సిందే. మంచు విష్ణు, కాజల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. త్వరలోనే విడుదల కాబోతోంది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది.
పేరుకు తగ్గట్టే.. నలుగురు మోసగాళ్ల చుట్టూ తిరిగే కథ ఇది. ఏకంగా రెండు వేల ఆరొందల కోట్ల స్కామ్ నేపథ్యంలో సాగుతుంది. ఆ స్కామ్ ఎవరు చేశారు? దాన్ని పోలీసులు ఎలా పట్టుకున్నారన్నది తెరపై చూడాలి. సైబర్ క్రైమ్ ఈ సినిమాకి కోర్ పాయింట్ గా కనిపిస్తోంది.
“డబ్బు సంతోషాన్ని ఇస్తుందనుకున్నా
డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా
ఒట్టేసుకున్నా – ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని…
లక్ష్మీదేవి ఎందుకంత రిచ్చో తెలుసా?
నాలుగు చేతులతో సంపాదిస్తుంది కాబట్టి..
డబ్బున్నోడి దగ్గర డబ్బు కొట్టేయడం
తప్పేం కాదు..
అనే డైలాగులు ట్రైలర్లో వినిపించాయి. రేసీ స్క్రీన్ ప్లే, ట్విస్టులు ఈ సినిమాకి ప్రధాన బలం అని చిత్రబృందం చెబుతోంది. దానికి తగ్గట్టే.. ట్రైలర్లో షాట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్య విష్ణు చేసిన సినిమాల్లో ఇది విభిన్నమైన సినిమానే అనిపిస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.