అమరావతి మీద .. అమరావతి అభివృద్ధి మీద తమకు ఎంతో అభిమానం ఉందని వైసీపీ నేతలు ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ..ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు వేరే దేశంలో లేవుగా అంటూ కొత్త కథ వినిపిస్తున్నారు. ఇప్పటి వరకూ వారు అన్న మాటలకు… చేసిన వాదనలకు.. పూర్తి భిన్నమైన స్వరం బయటకు వస్తోంది. అమరావతిని అభివృద్ధి చేసి తీరుతామని కంకణం కట్టుకున్నామన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతేనా.. పరిపాలనా రాజధానిని విశాఖకు తీసుకెళ్లడానికి టైం ఫ్రేం కూడా లేదని చెబుతున్నారు. కోర్టులో ఉండగా ఎలా తీసుకెళ్తామని అంటున్నారు. బొత్స మాటలు.. వైసీపీ చేతలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మూడు రాజధానుల అంశంలో వైసీపీ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందేమో అన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది.
అయితే.. ఇదంతా స్థానిక ఎన్నికల మహత్యమని.. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటిలు అన్నింటిలోనూ రాజధాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తూండటంతోనే.. ఎన్నికల కోసం వైసీపీ తన విధానాన్ని మార్చుకున్నట్లుగా ప్రజలను మభ్య పెడుతోందన్న అనుమానాలు రాజకీయ పార్టీలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో రాజధాని సెంటిమెంట్ వర్కవుట్ అవడం కన్నా కోస్తాలోని పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ డ్యామేజ్ జరుగుతోందన్న అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే.. హడావుడిగా రాజధాని నిర్మాణాలను కడతామని.. ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. నిజానికి ఇవన్నీ ఎన్నికల దృష్టితో తీసుకున్న నిర్ణయాలే.
అమరావతి నిర్మాణాల విషయంలో కనీసం ఓ ఆలోచన ఉన్నా.. ఈ పాటికి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి చెల్లించి ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వం రూ. మూడు వేల కోట్ల అప్పునకు గ్యారంటీ ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఏపీ సర్కార్కు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక వేళ ఇచ్చినా అది.. ఎన్నికల్లోపు సాధ్యం కాదు. కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ అమరావతి గురించి.. స్మశానం, ఎడారి.. కుల రాజధాని అంటూ మాటలు వినిపించే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.