తెలుగు360 రేటింగ్ 2.5/5
దర్శకుడిగా ఓ ముద్ర పడడం ఓ లోపం. ఓ విధంగా శాపం కూడా. ఓ దర్శకుడి పేరు తలచుకోగానే `ఫలానా సినిమాలు బాగా తీస్తాడు` అనుకోవడం బ్రాండ్ అనుకుంటారు. కానీ అదే గుది బండ. దాన్నుంచి బయటపడడం అంత సులభమైన విషయం కాదు. చంద్రశేఖర్ ఏలేటి పైనా అలాంటి భారం ఉంది. ఆయన కథలు, సృష్టించే పాత్రలు.. అన్నీ మైండ్ గేమ్ చుట్టూనే తిరుగుతాయన్నది ముద్ర. అలాంటి జోనర్‌కి కమర్షియల్ టచ్ ఇవ్వడం అంత తేలికైన విషయం కాదు. కానీ… కమర్షియల్ హిట్ కొట్టడం ఎంత అవసరమో.. చంద్రశేఖర్ ఏలేటికి అర్థమైంది. అందుకే… తన జోనర్‌లోనే ఉంటూ.. కమర్షియల్ గా ఓ సినిమా తీయాలనుకున్నాడు. ఈ రెండింటినీ మిక్స్ చేస్తూ చేసిన సినిమా `చెక్`. మరి ఈ కాక్టైల్ కుదిరిందా, లేదా? `చెక్` లెక్కేంటి?
ఆదిత్య (నితిన్) ఓ దొంగ. తెలివిగా దొంగతనాలు చేసుకుని బతికేస్తుంటాడు. అయితే అనుకోకుండా.. తనపై టెర్రరిస్ట్ అనే ముద్ర పడుతుంది. ఓ నలభై మంది అమాయకుల చావు వెనుక ఆదిత్య హస్తం కూడా ఉందని పోలీసులు, కోర్టు నమ్ముతుంది. దాంతో.. ఆదిత్యకు ఉరిశిక్ష పడుతుంది. జైల్లో.. చెస్ నేర్చుకుంటాడు ఆదిత్య. అతని ఆట అందరినీ అబ్బుర పరుస్తుంది. హేమా హేమీలైన ఆటగాళ్లనందరినీ ఓడిస్తూ ఉంటాడు. ప్రపంచ ఛెస్ ఛాంపియన్‌గా అవతారం ఎత్తితే… రాష్ట్రపతి నుంచి క్షమాభిష సంపాదించవచ్చని ఆదిత్య లాయర్ (రకుల్ ప్రీత్ సింగ్ ) సలహా ఇస్తుంది. దాంతో.. ఆ పోటీలకు సమాయాత్తం అవుతాడు. మరి చెస్ ఛాంపియన్‌గా ఆదిత్య అవతరించాడా? రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించారా? అన్నది మిగిలిన కథ.
ఓ తెలివైన వాడు. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాల్సిరావడం, తన తెలివితేటలతో, తన మేధస్సుతో, తన ఆటతో విస్మయ పరచి – అందరి మనసుల్నీ గెలుచుకోవడం – ఇదీ `చెక్` అనే కథ పుట్టడానికి ఉత్ప్రేతరకంగా పనిచేసిన ఆలోచనలు. నిజంగా ఐడియా బాగుంది. చంద్రశేఖర్ ఏలేటి లాంటి తెలివైన దర్శకుడి చేతిలో పెడితే.. ఇంకా బాగుంటుంది. ప్రేక్షకులు ఆశించింది అదే. అయితే.. మంచి ఐడియాని ఎంచుకున్న చందూ… దాన్ని ఆచరణలో పెట్టడానికి కమర్షియల్ పంథాని ఎంచుకున్నాడు. లాజిక్లను దూరంగా నెట్టేశాడు. కావల్సినంత స్వేచ్ఛ తీసుకున్నాడు. టెర్రరిస్ట్ గా ముద్ర పడిన హంతకుడు.. జైలు నాలుగ్గోడల మధ్య చెస్ నేర్చుకోవడం, తొలి ప్రయత్నంలోనే కాకలు తీరిన వాళ్లని ఓడించడం.. ఇవన్నీ దర్శకుడు తీసుకున్న లిబర్టీనే. కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వెళ్తాడు ఆదిత్య. అక్కడ ఓ అమ్మాయి చెస్ ఆడుతుంటుంది. ఆమె చెస్ లో ఛాంపియన్ కూడా. అక్కడక్కడ నిలబడే.. ఎత్తులు వేసిన ఆదిత్య.. ఆ అమ్మాయిని రెండు మూడు ఎత్తుల్లో ఓడించేస్తాడు. తీరా చూస్తే.. ఆమె జడ్జ్ గారి మనవరాలు. ఓ కోర్టు ఆవరణలో చెస్ ఆడడం, ఆమెని హీరో ఓడించడం.. తను జడ్జ్ మనవరాలు కావడం.. ఇవన్నీ దర్శకుడు తీసుకున్న అతి స్వేచ్ఛకు నిదర్శనాలు. ఇలాంటివి సినిమా నిండా కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ లో.. హీరో ఫైట్ చేస్తూ.. ఎత్తులు వేయడం – నిజంగా.. చందూలోని కొత్త యాంగిల్ ని చూపిస్తుంది. ప్రత్యర్థికి హీరో `చెక్ మేట్` చెప్పడంతో.. ఇంట్రవెల్ కార్డు పడుతుంది. ఆ సీన్ తో కాస్త కిక్ వస్తుంది ప్రేక్షకులకు. అప్పటి వరకూ.. సోసోగా నడిచినా – ఇంట్రవెల్ నుంచి ఇదే స్పీడు ఆశిస్తాడు.
కానీ.. ద్వితీయార్థంలోనూ.. ఆట జోరందుకోలేదు. ఆ జైలు ఆవరణ చుట్టూనే తిరుగుతుంటుంది. హీరో మేధస్సుకి పదును పెట్టే ఒక్క సన్నివేశం కూడా దర్శకుడు రాసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు హీరో ఎలాంటి కేసులో ఇరుక్కున్నాడు? దాని వల్ల 40 కుటుంబాలు ఎంతటి మనోవేదనకు గురవుతున్నాయి? అనే విషయాన్ని దర్శకుడు సమర్థంగా చూపించలేకపోయాడు. కథకు ఆయువు పట్టు అదే అయినప్పుడు ఆ పాయింట్ ని ఎలా మిస్సయ్యాడో? ఛాంపియన్ గా అవతారం ఎత్తితే, క్షమాభిక్ష లభిస్తుందన్న పాయింట్ వరకూ ఓకే. కానీ.. తీరా చూస్తే దర్శకుడు చేసిందేంటి? ఇంత గెలిచినా – లాభం లేకపోయింది కదా? చివర్లో మళ్లీ హీరో తన తెలివితేటలకు పదును పెట్టి, జైలు నుంచి తప్పించుకుంటాడు. అంటే.. అంత వరకూ ఆడిన ఆటకు, వేసిన ఎత్తులకూ ప్రయోజనం లేదనేగా..?
క్లైమాక్స్ పై… దర్శకుడు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అది చూసి ప్రేక్షకులు షాక్ అవుతారనుకున్నాడు. కానీ.. ఈమధ్య రెగ్యులర్ గా సినిమాలు చూస్తున్నవాళ్లంతా.. ఆ ట్విస్ట్ ని ఊహించేస్తారు. అయితే… ఆ ట్విస్ట్ కి అనుసంధానంగా మరో ట్విస్టు వేసుకున్నాడు దర్శకుడు. అది క్లిక్కయితే.. క్లైమాక్స్ కి మంచి ఊపొచ్చేది. కానీ.. అది పేలవంగా మారింది. చంద్రశేఖర్ ఏలేటి మరీ… ఇలా ఎలా ఆలోచించాడా? అనిపిస్తుంది. సినిమా అంతా అయ్యాక… హీరో `పారిపోయిన టెర్రరిస్టు`గానే మిగిలిపోతాడు. తను నిరపరాధి అనిపించుకోడు. అంటే… ఈ సినిమా ద్వారా హీరో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయాడనే అర్థం. అలాంటప్పుడు.. ఈ కథకు ఇది సరైన ముగింపు ఎలా అవుతుంది?
నితిన్‌కి కొత్త తరహా పాత్ర. తన పరిధి మేరకు మెప్పించాడు. అయితే తనలోని అన్ని కోణాల్నీ బయటపెట్టే పాత్ర అయితే కాదు. నితిన్ ని సైతం నాలుగ్గోడల మధ్య బంధించేశాడనిపిస్తోంది. ప్రియావారియర్ కనిపించింది కాసేపే. రకుల్ తన గత చిత్రాలకు భిన్నమైన పాత్ర అయితే ఎంచుకుంది గానీ, ఇంపాక్ట్ చూపించలేకపోయింది. సాయిచంద్ నటన సహజంగా అనిపిస్తే… మురళీ శర్మ, సంపత్ రాజ్‌లు తమ రొటీన్ నటననే ప్రదర్శించారు.
ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. అందులోనూ కల్యాణీ మాలిక్ తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఆ పాట చిత్రీకరణ కూడా సోసోగానే సాగుతుంది. నేపథ్య సంగీతం విషయంలో కల్యాణీ మాలిక్ కాస్త కష్టపడ్డాడు. కెమెరావర్క్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ చెప్పుకోదగిన కృషి చేశాయి. `ఆశ, ఊరిపి రెండూ ఒక్కటే. ఒకటి వదులుకుంటే.. రెండోది చనిపోతుంది` లాంటి డైలాగులు బాగున్నాయి. అయితే కొన్ని చోట్ల.. మరీ ప్రవచనాల స్థాయిలో… ధారాళంగా, కావల్సినదానికంటే ఎక్కువ డైలాగులు రాశారు. చంద్రశేఖర్ ఏలేటి.. కమర్షియల్ యాంగిల్ ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అందుకోసం తన సహజమైన బలాల్ని వదులుకోవాల్సివచ్చింది.
ఫినిషింగ్ టచ్: ఆటలు సాగలేదు
తెలుగు360 రేటింగ్ 2.5/5