తెలుగు360 రేటింగ్ 2/5
మన విద్యా వ్యవస్థ ఓ లోపాల పుట్ట. మార్కులు, ర్యాంకులే… చదవు అనుకుంటారు. ఈ బలహీనతని ఆసరా చేసుకుని కార్పోరేట్ కాలేజీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. చదవు పేరుతో వ్యాపారం చేసుకుంటున్నాయి. ఫీజుల భారం తట్టుకోలేక తల్లిదండ్రులు సతమతమవుతుంటే, పెరుగుతున్న ఒత్తిడిని భరించలేక… విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్పొరేట్ కాలేజీల దందాపై ఎన్ని సినిమాలొచ్చినా.. ఈ పాయింట్ చుట్టూనే కథలు అల్లారు. ఇప్పుడొచ్చిన `అక్షర`ది కూడా… అలాంటి కథే.
అక్షర (నందితా శ్వేత)కు చదువంటే చాలా ఇష్టం. కష్టపడి చదివింది. డాక్టరో… ఇంజనీరో అయ్యే అవకాశం ఉన్నా – టీచర్ వృత్తినే ఎంచుకుంది. ఎందుకంటే ఆ వృత్తంటే తనకు అంత గౌరవం. వి.వి. కాలేజీలో లెక్చలర్గా చేరుతుంది. పిల్లలపై ఒత్తిడి పెంచకుండా… ప్రేమతో పాఠాలు చెబుతుంది. తన పనితనాన్ని చూసి అదే కాలేజీలో పనిచేసే శ్రీతేజ్ (శ్రీతేజ్) అక్షరని ఇష్టపడతాడు. తనతో పాటు.. అక్షర ఉండే కాలనీలోని ముగ్గురు స్నేహితులు (షకలక శంకర్, సత్య, మధునందన్)లు కూడా అక్షర ఆకర్షణలో పడిపోతారు. ఈ ముగ్గురూ ఒకరికి తెలియకుండా మరొకరు అక్షర వెంట పడుతుంటారు. ఓరోజు `నా మనసులోని మాట చెబుతాను` అంటూ అక్షరని ఓ చోటుకి తీసుకెళ్తాడు శ్రీతేజ్. అక్కడ అనుకోని ఘటన జరుగుతుంది. అక్షరలోని మరో రూపం బయటపడుతుంది. అదేంటి? అది చూసి ఆ ముగ్గురు స్నేహితులు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు అక్షర ఎవరు? తను విశాఖపట్నం ఎందుకు వచ్చింది? ఆ కాలేజీలో ఎందుకు చేరింది? అనేదే మిగిలిన కథ.
విద్యావ్యవస్థని ప్రక్షాళన చేయమంటూ… చాలా సినిమాలు నీతి బోధ చేశాయి. అలాంటి ఏ సినిమా కథైనా… కార్పొరేట్ కాలేజీల దుర్మార్గాల చుట్టూనే తిరుగుతుంది. అక్షర కూడా అంతే. అయితే దానికి కొంత కామెడీ, కొంత ఎమోషన్, కొంత ఇన్వెస్టిగేషన్, కొంత రివైంజ్ డ్రామా అంటూ… అన్ని రకాల మసాలాలను టచ్ కలుపుకుంటూ వెళ్లాడు. తొలి భాగం వాల్తేర్ గ్యాంగ్ (షకలక శంకర్, సత్య, మధునందన్) కామెడీతో సరిపోతుంది. వీళ్లంతా.. అక్షర వెంట పడడం, అక్షర దృష్టిలో పడడానికి నానా తంటాలు పడడంతో తొలి సగం గడిచిపోతుంది. అసలు కథలోకి వెళ్లడానికి దర్శకుడు ఇంట్రవెల్ వరకూ కాలయాపన చేశాడు. ఇంట్రవెల్ లో అక్షర నిజ స్వరూపం చూపించి కాస్త షాక్ కి గురి చేశాడు. అయితే అంతకు ముందు జరిగిన కథ ఏమాత్రం కనెక్ట్ కాదు. అటు వినోదం, ఇటు ఎమోషన్ పండక… తొలి అర్థ భాగం వ్యర్థమైన భావన కలుగుతుంది.
ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. అక్షరలో వేట ఎందుకు సాగిస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది. అక్షరని పోలీసులు ఎలా పట్టుకుంటారు? అనేది మరో ఎపిసోడ్. దాన్ని ఆసక్తిగా మలచాల్సింది. అక్షరనే పోలీసులకు లొంగిపోయి, ఆ ఆసక్తి లేకుండా చేసింది. ఆ తరవాత.. అక్షర ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అది కాస్త ఎమోషనల్ గానే రాసుకున్నాడు దర్శకుడు. కార్పోరేట్ కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లోకి ఎలా చొచ్చుకుపోవాలనుకుంటాయో, వాటి వల్ల ప్రభుత్వ పాఠశాలలూ, కాలేజీలూ ఎలా మూత పడుతున్నాయో.. ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థుల్ని ఎలా బుట్టలో వేసుకుంటారో కళ్లకు కట్టారు. రాఘవ పాత్ర, ఆ పాత్ర వెనుక లక్ష్యం ఆకట్టుంటాయి. అయితే ఫ్లాష్ బ్యాక్ అయ్యాక.. కథ మళ్లీ రొటీన్ బాట పడుతుంది. ప్రెస్ మీట్లో.. అక్షర స్పీచు చూసి, రాష్ట్రం మొత్తం అక్షర పక్షాన నిలుస్తుంది. ప్రభుత్వం దిగి వస్తుంది. విద్యా వ్యవస్థపై ప్రక్షాళన కార్యక్రమానికి దిగడంతో కథ ముగుస్తుంది.
దర్శకుడి ఉద్దేశ్యం మంచిది కావొచ్చు. పాయింట్ ఈ తరానికి అవసరమైనది కావొచ్చు. కానీ దాన్ని చెప్పే విధానం ఇది కాదేమో అనిపిస్తోంది. తొలి అర్థ భాగంలో అనవసరమైన కామెడీతో టైమ్ పాస్ చేయాలనుకున్నారు. అయితే ఆ కామెడీలో పస లేదు. కాలేజీ వ్యవహారాలు సో..సో.. గా సాగుతుంటాయి. ఫీజులు, ఆత్మహత్యలు.. వీటి చుట్టూ నడిచినా – ఆయా సన్నివేశాల్ని బలంగా చూపించలేకపోయారు. విద్యావ్యవస్థలో ప్రక్షాళన తీసుకొచ్చే కొత్త ఐడియా అంటూ దర్శకుడు ఇవ్వలేకపోయాడు. ఏదో ఇద్దరు ముగ్గుర్ని చంపితే.. వ్యవస్థలో మార్పులు వచ్చేస్తాయా? అక్షర అందరిలోనూ కొత్త బీజమేసే పనేదో చేసి ఉంటే.. తప్పకుండా అక్షర చిత్రంపై ఓ ప్రత్యేకమైన ముద్ర పడేది.
నందిత శ్వేత తన పనిని సిన్సియర్ గా చేసింది. తన నటనలో లోపాలేం లేవు. కానీ మిగిలిన పాత్రధారుల ఎంపికలో దర్శకుడు తప్పులు చేశాడు. ముఖ్యంగా విలన్ పాత్రకు. అంత బరువైన పాత్రని సంజయ్ మోయలేకపోయాడు. వాల్తేరు గ్యాంగులో కాస్తో కూస్తో సత్యనే బెటర్ అనిపించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్లో చంద్రబాబుగా నటించిన శ్రీతేజ్ కి ఇందులో కీలకమైన పాత్ర దక్కింది. తనని చూస్తున్నప్పుడల్లా.. ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబునే గుర్తొస్తాడు.
పాటలకు స్కోప్లేదు. విశాఖ తీరంలో జరిగిన కథ ఇది. బీచ్ అందాల్ని బాగానే ఫోకస్ చేశాడు కెమెరామెన్. ఓ బలమైన పాయింట్ నిచెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం.. బలమైన సన్నివేశాల్ని రాసుకోవడంలో తేలిపోయింది. విద్యా వ్యవస్థలోని లోపాల్ని చెబుతూ రాసుకున్న సంభాషణలు ఓకే అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో అమ్మాయిలు చేరకపోవడానికి కారణం.. అక్కడ సరైన మరుగుదొడ్డి సౌకర్యాలు లేకపోవడమే అనే డైలాగ్ ఉంది. అది పచ్చి నిజం. ఇలాంటి వాస్తవాల్ని ప్రతిబింబించే ప్రయత్నం చేసినా, అది బలంగా లేకపోయింది. దాంతో.. అక్షర తేలిపోయింది.
తెలుగు360 రేటింగ్ 2/5