పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలని కలుపుకుంటే సింహభాగం అధికార వైఎస్ఆర్సిపి పార్టీ గెలుచుకుంది. అయితే కొద్ది చోట్ల మాత్రమే విపక్షాలు గెలిచినప్పటికీ, గెలిచిన ఆ కొద్ది చోట్ల అధికార పార్టీ నాయకులు ప్రజల మీద, విరుచుకుపడడం బెదిరించడం, కేసులు పెడతామని చెప్పడం పథకాలు కట్ చేస్తామని చెప్పడం, ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ముందుకు వచ్చిన సంప్రదాయం. నిన్న రాత్రి వైఎస్ఆర్ సీపీ నేతలు మత్స్యపురి గ్రామంలో చేసిన అరాచకం ప్రధాన ఛానళ్లకు కనబడక పోయినప్పటికీ, సోషల్ మీడియా కారణంగా ఆ బెదిరింపు వీడియోలు ప్రజలకు చేరుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ సంఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసైనికుల పై భీమవరం ఎమ్మెల్యే చేస్తున్న దాడులను విమర్శించారు. వివరాల్లోకి వెళితే..
భీమవరం మత్స్యపురి లో వైఎస్ఆర్ సిపి నేతల అరాచకం, గ్రంధి శ్రీనివాస్ బెదిరింపులు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీర వాసరం మండలంలోని ఒక గ్రామ పంచాయతీలో 14 స్థానాలకు పోటీ జరిగితే 12 స్థానాలలో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఒక దళిత మహిళను సర్పంచ్ గా ఎన్నుకున్నారు. గెలిచిన సందర్భంగా ఆ దళిత మహిళ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి వస్తుంటే వైయస్సార్ సిపి నాయకులు అడ్డుకున్నారు. ఆవిడ పై దాడి చేసి పూలదండ చింపేశారు. ఆ తర్వాత కూడా జనసేన పార్టీకి మద్దతు ఇచ్చిన వార్డులలో జనసైనికుల పై దాడులకు తెగబడ్డారు వైఎస్ఆర్సిపి నాయకులు. ఇక తాజాగా నిన్న రాత్రి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జనసైనికుల ని బెదిరిస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గ్రంధి శ్రీనివాస్ అరాచకాన్ని విడనాడాలి: పవన్ కళ్యాణ్
జనసైనికుల పై జరుగుతున్న దాడులను ఖండించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ సాధిస్తున్న విజయాలు చూసి ఓర్వలేక చాలా మంది వైసీపీ నాయకులు అనేక నియోజక వర్గాలలో దాడులు చేస్తున్నారని, దాంట్లో భాగంగానే భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం గ్రామపంచాయతీ లో దళిత మహిళ పై గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు దాడి చేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. సర్పంచ్ గా గెలిచిన దళిత మహిళ కారేపల్లి శాంతిప్రియ ఇంటి మీద కూడా దాడి చేసి , వార్డు మెంబర్ల మీద దాడులు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు తమ డిఎన్ఎ రౌడీయిజం అని నిరూపించుకున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆ 151 మంది ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, వేరే పార్టీ లని అభిమానించే వారిపై దాడులు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అలాగే ఆ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తమ పార్టీకి మద్దతు ఇచ్చే వారిని చాలా రకాలుగా బెదిరించడం, సభ్యసమాజం తలదించుకునేలా దళితులను దుర్భాషలాడటం గర్హనీయం అని విమర్శించారు.
గ్రంధి శ్రీనివాస్ ఆకు రౌడీ, కోపరేటివ్ బ్యాంకు ల ను ముంచేసిన వ్యక్తి: పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రంధి శ్రీనివాస్ ఒక ఆకు రౌడీ అని, కాయకష్టం చేసి చిన్న చిన్న వ్యాపారులు, స్కూల్ టీచర్లు కోపరేటివ్ బ్యాంక్ లో డబ్బులు దాచుకుంటే ఆ డబ్బును దోచేసిన గ్రంధి శ్రీనివాస్ నుండి ఇంతకంటే మంచి ప్రవర్తన వస్తుందని అనుకోలేము అని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే భీమవరం ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడాల్సింది గా పవన్ కళ్యాణ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. గతంలో ఇక్కడ శాంతిభద్రతల కి విఘాతం కలిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అరాచకాలను కట్టడి చేయాలని డీజీపీ కి విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఇదే రకమైన దాడులు జనసైనికుల పై కొనసాగితే దానిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని హెచ్డీ చాలా పవన్ కళ్యాణ్.
ఏదేమైనా పంచాయతీ ఎన్నికలు ఇంత ఉద్రిక్తతలకు దారి తీయడం శోచనీయం. దాదాపు 85 శాతం సీట్లు గెలిచామని చెప్పుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలు, విపక్షాల నాయకులపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, అవి కాస్తా వీడియోలతో సహా సోషల్ మీడియాలో హల్చల్ చేయడం వైఎస్ఆర్సిపి గ్రాఫ్ ని దారుణంగా పడేసింది. వేర్వేరు కారణాల వల్ల ప్రజల్లో సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత వైఎస్సార్సీపీ నాయకుల తీరు కారణంగా ఈసారి మరింత ఎక్కువగా ఉంటోంది. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలకు, విమర్శలకు వైఎస్ఆర్సిపి నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి