బండి సంజయ్ కేసీఆర్‌ను ఉత్కంఠలో ముంచెత్తాలనుకుంటున్నారు. అదీ కూడా భయంతో వచ్చే ఉత్కంఠను ఆయనకు కల్పించాలని అనుకుంటున్నట్లుగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల వరకూ కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని నమ్మకంగా చెప్పేవారు. ఢిల్లీకి వెళ్లి వచ్చాక కూడా.. కేసీఆర్ జైలుకువెళ్లకుండా పొర్లు దండాలు పెట్టి వచ్చారని ఆయినా సరే అరెస్ట్‌ను తప్పించుకోలేరన్నారు. కేసీఆర్ అవినతికి మొత్తం ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే తర్వాత కేసీఆర్ అరెస్ట్ గురించి పెద్దగా మాట్లాడటం లేదు. తాజాగా మరో రకమైన ప్రకటనలు చేస్తున్నారు.
అదేమిటంటే… కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని.. ఆ విషయాన్ని తాను కనిపెట్టానని అంటున్నారు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్‌ను కుదిపేసే అంశం అవుతుందని.. అందుకే… ఆ వివరాలు బయట పెట్టేందుకు స్పీకర్ అనుమతిని కోరానని ఆయన చెబుతున్నారు. బీజేపీలో కొన్ని చేరికల సందర్భంగా మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన ఈ తరహా హింట్ ఇచ్చారు. కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించిన అంశంపై ఆధారాలున్నాయని.. బీజేపీ అధిష్ఠానం అనుమతితో కేసీఆర్ బండారం బయటపెడతానని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సయయంలో కేసీఆర్ ఎంపీగా ఉన్నారు.
కొన్నాళ్లు కేంద్రమంత్రిగా కూడా ఉన్నారు. బండి సంజయ్ ఏ అంశంపై మాట్లాడతారో చెప్పలేదు కానీ.. పార్లమెంట్‌ను కుదిపేస్తుందని చెబుతున్నారు. ఆయనకు బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి సమాచారం వచ్చి ఉంటుందని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీలోని ఓ వర్గం చెప్పుకుంటోంది. అయితే కేసీఆర్ ను జైలుపు పంపుతామన్న ప్రకటనల్లాగే దీనిపై కూడా సైలెంటయితే.. ఈ సారి బండి సంజయ్ చెప్పే మాటలకు పెద్దగా ప్రాధాన్యత దక్కదు.