మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ కోసం న్యాయపోరాటం చేసిన విపక్షాలకు ఎదురుదెబ్బ తగిలిగింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లన్నింటినీ హైకోర్టు తోసి పుచ్చింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలని హైకోర్టు తేల్చేసింది. దీంతో ఇప్పటికే గత నోటిఫికేషన్ కొనసాగిస్తూ ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో యథావిధిగా ఎన్నికలు జరుగుతాయి. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎస్ఈసీ ఇక మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టారు. మార్చి 1న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.
ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు వచ్చి తమ అభిప్రాయం చెప్పాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కోడ్ను పాటించాలని.. రాజకీయ పక్షాలను ఎస్ఈసీ కోరే అవకాశం ఉంది. మార్చి పదో తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నుంచి తదుపరి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నామినేషన్ల దాఖలుక ుచాన్సివ్వలేదని.. పెద్ద ఎత్తున… దౌర్జన్యాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయని మళ్లీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని విపక్షాలు కోరుతున్నాయి. గతంలో ఎస్ఈసీ సమావేశం జరిపినప్పుడు అదే చెప్పారు.
అయితే ఎస్ఈసీ మాత్రం ఏకగ్రీవంగా అభిప్రాయాలు చెప్పినప్పటికీ.. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో రాజకీయ పార్టీలు ఎస్ఈసీపై విమర్శలు చేశాయి. కోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విషయంలో అభిప్రాయాలు చెప్పడానికి పార్టీలు హాజరవుతాయా లేదా అన్నది సందేహమే.