వలంటీర్ల సేవలను గుర్తించిన సీఎం జగన్ వారికి జీతాలు పెంచడం మినహా గొప్ప గౌరవ మర్యాదలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. మూడు కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. వారు అందించే సేవలను బట్టి మూడింటిలో ఒక దానికి ఎంపిక చేస్తారు. వాటికి నగదు పురస్కారాలు కూడా ఉంటాయి. సీఎం జగన్ మూడు ప్రాంతాల్లో జరిగే సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఆయన వాలంటీర్లను ఆత్మ బంధువులుగా చూస్తున్నారు.
పెన్షన్ల పంపిణీ, విధులకు హాజరు, యాప్ల వినియోగం. పథకాల అమల్లో చురుగ్గా భాగస్వామ్యం అయిన వారికి అవార్డులు లభిస్తాయి. మొదటి కేటగిరి సేవామిత్ర కోసం ప్రశంశాపత్రంతో పాటు రూ. పదివేల నగదు ఇస్తారు. రెండో కేటగరిలో రూ. ఇరవై వేల పురస్కారం ఇస్తారు. రెండో కేటగరిలో ప్రతి మండలానికి ఐదుగురు వాలంటీర్లకు అవార్డులిస్తారు. మూడో కేటగిరిలో క్యాష్ ప్రైజ్ రూ. 30వేలు ఇస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఐదుగుర్ని ఎంపిక చేస్తారు. వీరందరి ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. ఉగాది నుంచి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వాలంటీర్లు రూ. ఐదు వేలకే పని చేస్తున్నారు. ఇటీవల జీతాలు పెంచాలని ఆందోళన చేశారు. జీతాలు పెంచే చాన్సే లేదని.. వారు సేవ మాత్రమే చేస్తున్నారని తేల్చిన సీఎం జగన్.. సేవలకు గుర్తుగా అవార్డులు ఇస్తామన్నారు. ఆ ప్రకారం.. ఇప్పుడు… అవార్డులు.. సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన కూడా స్వయంగా పాల్గొని.. వాలంటీర్లను సన్మానించనున్నారు.