పెన్షన్ రూ. మూడు వేలకు పెంచుకుంటూపోతామని జగన్ హామీ ఇవ్వడంతో .. పెన్షనర్లు అంతా ఓట్ల వర్షం కురిపించారు. అయితే 2019 మేలో అధికారం చేపట్టిన జగన్.. రూ.250మాత్రమే పెంచారు. అప్పుడే క్లారిటీ ఇచ్చారు… ఒకే సారి రూ. మూడు వేలు చేస్తాననలేదని… పెంచుకుంటూ పోతానని చెప్పానన్నారు. ఏడాదికో రూ.రెండు వందల యాభై పెంచుతామని చెప్పుకొచ్చారు. అయితే రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ మరోసారి పెంచలేదు. ఈ సంవత్సరం బడ్జెట్లోనూ పెంపు ఉండే అవకాశాలుకనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరిలో పెంచుతామని సంక్షేమ క్యాలెండర్లో పేర్కొన్నారు. దీంతో పెన్షనర్లు అవాక్కవాల్సి వస్తోంది.
ఇటీవల సీఎం జగన్ కేబినెట్ భేటీలో సంక్షేమ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పథకాలకు ఏ ఏ నెలలో నగదు బదిలీ చేస్తారో అందులో వివరించారు. పెన్షన్ పెంపు గురించి.. వచ్చే ఏడాది జనవరి మాసంలో ప్రతిపాదించారు. దాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. రూ. 250 పెంచడానికి రెండున్నరేళ్ల సమయం తీసుకోవడమే దీనికి కారణం. ఇప్పటికే పెన్షన్ పెంపు అంశంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏటా రూ.250 పెంచుతామన్న ప్రభుత్వం .. పెన్షనర్లను మోసం చేస్తోందని మండి పడుతున్నారు. నిజానికి వైఎస్ ఆర్ వర్థంతికి.. జయంతికి పలుమార్లు పెంపు ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ ప్రభుత్వం అమలుకు వచ్చే సరికి వెనుకడుగు వేసింది.
దాదాపుగా యాభై లక్షల మంది వరకూ ఉన్న వృద్ధాప్య.. ఇతర సామాజిక పెన్షనర్లు పెద్ద ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. చంద్రబాబు హయాంలో రూ. రెండు వందలు ఉండే పెన్షన్‌ను రూ. వెయ్యి చేశారు. ఆ తర్వాత ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ. రెండు వేలు చేశారు. దీంతో సీఎం జగన్ తాను రూ. మూడు వేలు ఇస్తానని ప్రకటించారు. కాకపోతే ఇక్కడ తిరకాసు పెట్టారు. పెంచుకుంటూ పోతానన్నారు. దీంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. ప్రమాణస్వీకారం రోజున రూ రెండు వందల యాభై మాత్రమే పెంచడంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు.. అదే మొత్తం రెండున్నరేళ్లు కొనసాగుతూండటంతో మరింత ఆవేదన చెందే పరిస్థితికనిపిస్తోంది. విపక్షాలకు ఇది విమర్శలకు పనికొచ్చే విషయంగా మారనుంది.