తన పేరు సంపత్. నోట్లోంచి గాలి తప్ప మాట రాదు. అందుకే తనని గాలి సంపత్ అని పిలుస్తారు. తనకో కొడుకు. తనకీ కొన్ని ఆశయాలు, ఆశలు, ప్రేమలూ ఉన్నాయి. కానీ.. తనకు తన తండ్రే అడ్డొస్తున్నాడన్న కోపం, బాధ, అనుమానం. మరి.. ఈ తండ్రీ కొడుకుల కథ ఎలా సాగింది? తెలియాలంటే `గాలి సంపత్` చూడాల్సిందే. దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, కథ, మాటలు. స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. అనీష్ కృష్ణ దర్శకుడు. తండ్రీ కొడుకులుగా రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు నటించారు. మార్చి 11న విడుదల కాబోతోంది.
అనిల్ రావిపూడి అంటే కామెడీ. కామెడీ అంటే అనిల్ రావిపూడి. ఆ మార్క్.. ట్రైలర్‌లో కనిపించింది. ఫ.. ఫ.. ఫీ.. ఫా అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసే గా(లి)రడీ మాటలు, దానికి సత్య ఇచ్చే ఎబ్రివేషన్లు, రఘుబాబు అనుమానాలు.. ఇవన్నీ ఫన్నీగా సాగాయి. అయితే.. ఎమోషనల్ టచ్ కూడా ఉందని అర్థమైంది.
”పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా, ప్రేమగా కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలొచ్చేసరికి.. పెద్దోళ్లు ఏం చేసినా, ఊరికే చిరాకులు వచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి. నేను కూడా మానాన్నని కాస్త ఓపిగ్గా, ప్రేమగా అడగాల్సింది సార్”
అనే డైలాగ్‌తో.. తండ్రీ కొడుకుల మధ్య గ్యాప్ ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుందో చెప్పేశాడు అనిల్ రావిపూడి. అటు ఎమోషన్, ఇటు ఫన్, కాస్త థ్రిల్ ఇవన్నీ మిక్స్ చేసిన సినిమా ఇది. ఆ తూకం సమపాళ్లలో కుదిరితే.. శ్రీవిష్ణుకి మరో హిట్ దక్కినట్టే.