నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే నెల ఏడో తేదీన వస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ ఎన్నికల ప్రచారసభలో హింట్ ఇచ్చినా అది విపక్షాలను తప్పుదోవ పట్టించడానికేనని తేలిపోయింది. అయితే సాధారణంగా ఎన్నికలు జరిపే ముందు .. కొన్ని మీడియా సంస్థలు.. రెండు, మూడు నెలల పాటు సర్వేల పేరిట హడావుడి చేస్తాయి. ఈ సారి ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ ప్రముఖ మీడియా సంస్థలేవీ ఎలాంటి సర్వేలు ప్రకటించలేదు. సాధారణ ఎన్నికలైనా.. ఇతర రాష్ట్రాల ఎన్నికైనా… జాతీయ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ మీడియా సంస్థలన్నీ.. ఇతర పోల్ సంస్థలతో కలిసి సర్వేలు చేసి.. ప్రజల మీదకు వదిలేవి. అవి నిజమవుతాయో.. అబద్దమవుతాయో తెలియదు కానీ.. ఓ అంచనాకు ప్రజలు రావడానికి ఉపయోగపడేవి.
ఈ సారి మాత్రం ఎలాంటి సర్వేలు విడుదల చేయలేదు. ఇప్పుడు విడుదల చేయడానికి అవకాశం లేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించుకోవచ్చు కానీ.. సర్వేలు ప్రకటించడానికి లేదు. ఎందుకు ఈ మీడియా సంస్థలు సర్వేలు చేయలేదనేది ఇప్పుడు చర్చనీయాంశమయింది. బీజేపీకి గడ్డు పరిస్థితి ఉందని.. ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావు కాబట్టే.. సర్వేలు చేయలేదనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అసోంలో అధికార వ్యతిరేకత ఇబ్బందికరంగా మారింది. బెంగాల్లో పుంజుకున్నా అధికారం అందుకుంటారని ఎవరూ నమ్మలేకపోతున్నారు.
ఇక పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ క్రమంలో బీజేపీకి పాజిటివ్ ఫలితాలు రావు కాబట్టే… సర్వేలను మీడియా సంస్థలన్నీ లైట్ తీసుకున్నాయని చెబుతున్నారు. పరిస్థితి చూస్తే అంతే ఉంది. గతంలో హోరెత్తించిన సర్వే సంస్థలు .. తమ ప్రధానమైన పనిని మానేసి సైలెంట్ గా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి.