తమిళనాడు ఎన్నికల్లో తనను ఎవరూ పట్టించుకపోయినా కమల్ హాసన్ మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన బలం తేలిపోవడంతో ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన పార్టీలు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆయన విడిగా పోటీ చేయడమే మంచిదని అటు అన్నాడీఎంకే కూటమి.. ఇటు డీఎంకే కూటమి కూడా భావించాయి. అందుకే ఆయనతో ఎలాంటి చర్చలు జరపలేదు. ఎవరూ ఏ కూటమిలోనూ చేర్చుకోకపోతే ఏమయిందనుకున్నారేమో కానీ.. తానే ఓ కూటమిని పెట్టేశారు కమల్ హాసన్. ధర్డ్ ఫ్రంట్ పెట్టేశానని.. వచ్చేవారు వచ్చి తనతో చేతులు కలపవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు.
శరత్ కుమార్ .. కమల్ హాసన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు కూడా ఉనికిలో లేని ఓ పార్టీ ఉంది. కమల్ హాసన్.. రజనీకాంత్ తో పోటీగా ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ.. మాస్ ఇమేజ్ లేదు. దాంతో ఆయన పార్టీ పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. మక్కల్ నీది మయ్యం పేరుతో ఆయన పెట్టిన పార్టీలో కొంత మంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. రజనీకాంత్ పార్టీ పెడితే పొత్తు పెట్టుకుందామనుకున్నారు. కానీ రెడీ అని చెప్పిన తర్వాత రజనీకాంత్ మిడిల్ డ్రాప్ అయ్యారు. దాంతో కమల్ హాసన్ కు ఇక ఒంటరి పోరు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒంటరిగా పోటీచేస్తే తాను అయినా గెలుస్తాడో లేదో నన్న టెన్షన్ ఉంది.
అయినప్పటికీ.. కమల్ ఏ మాత్రం నిరాశ చెందడం లేదు. మూడో కూటమి తరపున తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటించేసుకుని రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి వర్సెస్ డీఎంకే కూటమి హోరాహోరీగా సాగుతోంది. శశికళ జైలు నుంచి విడుదలైనా… ప్రస్తుత ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు.