అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతాలను పెంచుతామని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా సౌకర్యాలను కల్పిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. అయితే ఆయన ఉద్దేశం విజయవాడ నగరపాలక సంస్థలో అధికారంలోకి రావడం కాదు.. రాష్ట్రంలో అధికారంలోకి రావడం. అధికారంలోకి వచ్చే సంగతి పక్కన పెట్టినా.. వాలంటీర్లకు జీతాలు పెంచుతామన్న ఆయన ప్రకటనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వాలంటీర్లపై టీడీపీ నేతలు చేస్తున్నన్ని విమర్శలు ఎవరూ చేయడం లేదు. వారు వైసీపీ కార్యకర్తలని.. ఎన్నికల కోసం.. వారిని వాడుకుంటున్నారని వైసీపీకి ఓటు వేసేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో వాలంటీర్లకు అనుకూలంగా కేశినేని నాని ప్రకటన హైలెట్ అవుతోంది.
వాలంటీర్ల విధుల విషయంలో కేశినేని నానికి భిన్నాభిప్రాయం ఏమీ లేదు. కానీ ఆయన మాత్రం… వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నారు. వాలంటీర్లు ఇటీవల ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. వాటిని తీర్చాలన్నారు. అయితే ససేమిరా అన్న సీఎం జగన్ వారిని సేవకులుగా మాత్రమే గుర్తిస్తామని జీతాలు పెంచే ప్రశ్నే లేదని తేల్చేశారు. సేవకులు కాబట్టి సన్మానాలు చేస్తామన్నారు. దీంతో వారిలో అసంతృప్తి గూడు కట్టుకుపోయింది. దీన్ని గుర్తించిన కేశినేని నాని … తాము అధికారంలోకి వస్తే వారికి జీతాలు పెంచడంతో పాటు వారు చేస్తున్న డిమాండ్లను పరిష్కరిస్తామని అంటున్నారు. వాలంటీర్లలో పది శాతం మంది అయినా ఇదేదో బాగుందని అనుకుంటే కేశినేని ప్లాన్ వర్కవుట్ అయినట్లే. ఎందుకంటే.. యాభై ఇళ్లను మార్కింగ్ చేసుకుంటున్న వాలంటీర్ ఎన్నికల సమయంలో … ప్రధాన ప్రచారకుడిగా వ్యవహరిస్తున్నారు.
వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేస్తున్నారు. ఇప్పుడు వారు వైసీపీకి వద్దు టీడీపీకి వేయండి అని ప్రచారం చేస్తే ఆ ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. కొంత మంది వైసీపీ నేతలు వాలంటీర్లపై వేధింపులకు పాల్పడుతూండటంలో వారిలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. మొత్తానికి వైసీపీ తమ వెన్నుముకగా భావిస్తున్న వాలంటీర్ల పై కి కేశినేని నాని బాణం వేశారు. నిజంగా అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతారో లేదో తెలియదు కానీ.. వారిలో ఓ ఆశను రేపడానికి మాత్రం ప్రయత్నించారు.