గోవు అంటే.. ముందుగా గుర్తొచ్చేది రాజకీయ పరంగా బీజేపీనే. గోమాత అంటూ.. తమ బ్రాండ్ అంబాసిడర్గా చేసుకుని రాజకీయాలు చేస్తూ ఉంటుంది. అలాంటి బీజేపీకే వైసీపీ పాఠాలు చెప్పాలని ప్రయత్నిస్తోంది. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలంటూ వైవీసుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు ఓ తీర్మానం చేసేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతామని వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. గోవును జాతీయప్రాణిగా చేయాలని బీజేపీకి వైసీపీ చెప్పాల్సిన పరిస్థితి రావడమే ఇక్కడ కాస్త ఆశ్చర్య కరమన్న చర్చ నడుస్తోంది.
ఇటీవలి కాలంలో ఏపీలో పెరిగిపోయిన మత రాజకీయాల నేపధ్యంలో తమ తమ మార్క్ చూపించుకోవడానికి అటు బీజేపీ.. ఇటు వైసీపీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో… టీటీడీ తీర్మానం ఆసక్తికరంగా మారింది. వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే.. నిజంగానే బీజేపీకి గోవును జాతీయ ప్రాణిగా చేయాలన్న ఆసక్తి ఉంటే తమ సొంత నిర్ణయం మేరకు చేస్తారు. అంతే కానీ వైసీపీ చెప్పిందని చేయరు. కానీ.. బీజేపీ అలా చేస్తుందని వైసీపీ అనుకుందో లేకపోతే.. తాము గోవుకు గొప్ప వీరాభిమానులం అని నిరూపించుకోవాలన్న తాపత్రయంతోనే ఈ రకమైన తీర్మానం చేశారన్న చర్చ బీజేపీలో జరుగుతోంది.
తామూ హిందూత్వ వాదులం అని చెప్పుకోవడానికి ఇటీవలి కాలంలో వైసీపీ అధినేత సహా అందరూ తాపత్రయ పడుతున్నారు. బహుశా.. ఆలయాలపై జరిగిన దాడుల వ్యవహారంతో తమపై మరక పడటమే దీనికికారణం అనుకోవచ్చు. అయితే గోవను తమ కన్నా గొప్పగా చూస్తున్నట్లుగా షో చేస్తున్న వైసీపీ తీరును బీజేపీ పాజిటివ్ గా తీసుకునే అవకాశాలు తక్కువగానే ఉంటాయి.