2013లో కేంద్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని నగదు బదిలీ రూపంలోకి మార్చాలనుకుంది. అప్పుడు బీజేపీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ప్రజల్ని దోచుకుంటున్నారని.. క్రమంగా సబ్సిడీని ఎత్తేయడానికి ఈ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు కూడా నమ్మి ఉద్యమంలోకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.కానీ మోడీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకి.. నగదు బదిలీ ప్రారంభించారు. వ్యతిరేకించిన వారందరూ దేశభక్తులు కాదని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో ఎవరూ.. నోరు మెదపలేదు. అప్పట్లో రూ. ఎనిమిది వందలు ఉండే గ్యాస్ సిలిండర్ ధరకు.. రూ. మూడు వందల వరకూ సబ్సిడీ వచ్చేది. ఎంతో కొంత ఇస్తున్నారు కదా అని ప్రజలు సర్దుబాటు చేసుకున్నారు.
కానీ ఇప్పుడు.. ఆ సబ్సిడీ.. రూ. నాలుగు నుంచి పదహారు రూపాయలకు పడిపోయింది. దీంతో ప్రజలు అవాక్కవ్వాల్సి వస్తోంది. అలాగని గ్యాస్ సిలిండర్ రేటు ఏ మాత్రం తగ్గలేదు. సబ్సిడీని వదులుకోవాలంటూ కేంద్రం… ఓ ప్రచారం చేసింది. స్టార్లతో ప్రకటనలు ఇప్పించింది. కానీ ఎక్కువ మంది వదులుకోలేదు. ఇప్పుడు సబ్సిడీ ఎత్తేసి కేంద్రమే ఎత్తేస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరు చూసి నగదు బదిలీలో ఇంత మోసమా అని .. ప్రజలు నోళ్లు నొక్కుకోవాల్సి వస్తోంది. ఇక ముందు ప్రభుత్వాలు నగదు బదిలీ చేస్తే ఇలాగే ఉంటుందా అన్న చర్చ కూడా ప్రారంభమయింది. ఏపీలో వ్యవసాయ దారులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఉచిత విద్యుత్ వద్దు.. మీటర్లు పెట్టి.. ఎంత వాడుకుంటే అంత నగదు బదిలీ చేయమని చెప్పింది. అలా చేస్తే రూ. నాలుగు వేల కోట్ల రుణం ఇస్తామని చెప్పింది.
దానికి ఏపీ సర్కార్ అంగీకరించి.. మీటర్లు పెడుతోంది. నగదు బదిలీ చేస్తామని… కంగారు పడొద్దని చెబుతోంది. కానీ గ్యాస్‌కు నగదు బదిలీలో ప్రభుత్వం చేసిన మాయాజాలం చూసిన తర్వాత చాలా మంది రైతులు కంగారు పడిపోతున్నారు. తమకూ ఇదే పరిస్థితి తీసుకొస్తే ఏం చేయాలా అని మథనపడుతున్నారు. కానీ ఇప్పటికే.. రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు పెట్టడానికి అంగీకరించింది. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఇప్పుడు రైతులు తప్పించుకోలేని స్థితిలో ఉన్నారు. మహా అయితే రెండు మూడేళ్లు మాత్రమే.. నగదు బదిలీ ఉంటుందని.. ఆ తర్వాత ఉచిత విద్యుత్ ఎగిరిపోయినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.