దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించి.. అమిత్ షా జల వివాదాలను పరిష్కరిస్తారని.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సమావేశం అయితే ఖరారైంది. నాలుగు, ఐదు తేదీల్లో అమిత్ షా తిరుపతిలోనే ఉండాల్సి ఉంది. అయితే హఠాత్తుగా సమావేశానికి నాలుగు రోజుల ముందు అమిత్ షా టూర్ క్యాన్సిల్ అయిందని సమాచారం అందింది. కారణాలేమిటో స్పష్టత లేదు. అమిత్ షా రాకపోతే.. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరిగే చాన్స్ లేదు.
ముఖ్యమంత్రుల స్థాయి వారితో సమావేశం పెట్టాలంటే అది ప్రధాని మోడీ లేదా.. అమిత్ షానే అయి ఉండాలి. లేకపోతే హాజరయ్యేందుకు ముఖ్యమంత్రులు కూడా ఆసక్తి చూపించరు. అంటే సమావేశం జరగనట్లేదని భావించాల్సి ఉంటుంది. తిరుపతి ఉపఎన్నిక, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో అమిత్ షా పర్యటనపై… బీజేపీ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. షా వస్తారు.. సీన్ మార్చేస్తారని అనుకున్నారు. కానీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వాటి ఎన్నికల ప్రచారంపై అమిత్ షా ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లుగా చెబుతున్నారు.
బెంగాల్, అసోంలతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లోనూ ఎన్నికల ప్రచారసభల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. తిరుపతిలో షా టూర్ రద్దు కావడంతో … అక్కడి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో కూడా బీజేపీ సైలెంట్ అయినట్లేననన్న చర్చ జరుగుతోంది. తిరుపతిలో ఖచ్చితంగా పోటీ చేసే ఉద్దేశం ఉంటే.. ఒక్క రోజు అయినా అమిత్ షా టూర్ పెట్టుకుని ఉండేవారని.. అంటున్నారు.