హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పీవీ కుమార్తె వాణిదేవిని గెలిపించడానికి కేసీఆర్.. హరీష్ రావుకు కూడా బాధ్యతలిచ్చారు. చాలాకాలంగా పార్టీలో సైడవుతూ వచ్చిన హరీష్ రావు.. ఇటీవలి కాలం వరకు ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం అయ్యారు. పార్టీలోనూ ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదు. ఆర్థిక మంత్రిగా… పేరుకే ఉన్నారు. ఆయన నిర్వహిస్తున్న విధులు కూడా పెద్దగా లేవు. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పనైపోయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన అవసరం కేసీఆర్ కు పడింది.అందుకే ప్రగతి భవన్ కు పిలిపించి మరీ కీలక బాధ్యతలిచ్చారు.
టిఆర్ఎస్ కు వరుస ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురవుతోంది. బీజేపీ వేగంగా దూసుకు వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పై అధికార పక్షంలో ఆందోళన కనిపిస్తోంది. పీఆర్సీ రాక ఉద్యోగులు, నియామకాల పట్ల నిరుద్యోగ యువత ప్రభుత్వం పట్ల అసంతృప్తి తో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఓడితే పార్టీ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అందుకే పార్టీకి వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్న రంగారెడ్డి జిల్లా బాధ్యతలను హరీష్ రావుకు పిలిచి మరీ అప్పగించారు. కేసీఆర్ చెప్పిన వెంటనే రంగంలోకి దిగిన హరీష్ .. జోరుగా ప్రచారం చేస్తున్నారు. తెరవెనుక వ్యూహాలను కూడా ప్రారంభించారు. ఇతర పక్షాలకు అనుకూలంగా ఉన్నాయనే ఓట్ల లెక్కలు తీసి తమ వైపు తిప్పే పని మొదలు పెట్టారు.
కేసీఆర్ వ్యూహంపై .. టీఆర్ఎస్లోనూ భిన్నమైన ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే ఆ క్రెడిట్ కేసీఆర్ కు పోతుందని.. ఓడిపోతే… హరీష్ ఖాతాలో మరో మైనస్ వేయవచ్చన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. హరీష్ టీఆర్ఎస్లో ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారన్నది నిజం. ఆయనకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందా లేకపోతే… ఓటములకు బాధ్యుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్నది ఎవరికీ అంతు చిక్కని విషయంగా మారింది.