ప్రతిపక్ష నేత చంద్రబాబును రేణిగుంట ఎయిర్ పోర్టులో పోలీసులు నిర్బంధించడం అనేక రకాల చర్చలు.. వాదనలకు కారణం అవుతోంది. అధికార పార్టీ నేతలు.. అభిమానులు..సోషల్ మీడియా కార్యకర్తలు..గతంలో వైజాగ్‌లో జగన్మోహన్ రెడ్డిని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పోనీయని ఘటన గురించి గుర్తు చేసి.. బాగా అయిందని.. టిట్ ఫర్ టాట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వారి మైండ్ సెట్‌కు ఇది బాగా అని అనిపిస్తోంది కానీ.. ప్రజాస్వామ్య రాజకీయం ఆశించేవారికి మాత్రం..ఇదేం ఆలోచన అని.. ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
విశాఖలో జగన్‌ను అడ్డుకున్న సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి ఎన్నికలు లేవు. అప్పటికే ఆంక్షలు విధించారు. తర్వాతిరోజు పెట్టుబడుల సదస్సు ఉంది. వీటన్నింటి కారణంగా జగన్ ను పోలీసులు వెనక్కి పంపారు. ఆ సమయంలో జగన్.. ఎయిర్‌పోర్టులో పోలీసులపై వీరంగం సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనను అడ్డుకున్న పోలీసుల్ని బ్లాక్ లిస్టులో కూడా పెట్టారు. ఇప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఎయిర్ పోర్టుల నుంచి వెనక్కి పంపేలా వ్యవహరిస్తున్నారు. గతంలో విశాఖలో అంతేచేశారు. ఇప్పుడు తిరుపతిలో అంతే చేశారు. రెండు సందర్భాల్లోనూ బయట ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. ఆయనరాజకీయ కార్యక్రమాలకు వెళ్తున్నారు. ప్రభుత్వ పరంగా పెట్టుబడుల సదస్సులూ చేయడం లేదు. అయినప్పటికీ.. చంద్రబాబును నిలిపివేసి టిట్ ఫర్ టాట్ అని ప్రచారం చేస్తున్నారు.
ప్రజలు కాదు ప్రతీకారమే రాజకీయం అనుకున్నప్పుడు..ఇలాంటివి సహజంగానే జరుగుతూఉంటాయి. నిజంగా రాజకీయ నాయకులు అయితే.. వైజ్‌గా ఆలోచించి.. గతంలో చంద్రబాబు అలా చేయడం వల్లే ఆయనకు ఘోర పరాజయం ఎదురయిందని.. తాము మరింత డీసెంట్‌గా ఉండాలని ఆనుకుంటారు. కానీ ఆయన కన్నా రెండింతలు ఎక్కువగా చేయడం వల్ల.. తమకు అంత కన్నా ఘోర పరాజయం ఎదురవుతుందని ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అంచనా వేయలేకపోతున్నారు. ఇక్కడ అధికారం అనే మత్తు వారి కళ్లను కప్పేస్తుందని అనుకోవచ్చు. ఇలాంటి పగ, ప్రతీకారాల కోసం అధికారాన్ని ఉపయోగించుకుంటే.. భవిష్యత్‌లో అవే వారి మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. భవిష్యత్ గురించి ఆలోచించకుండా క్షణిక ఆనందాలకోసం కక్ష రాజకీయాలుచేస్తే నష్టం జరిగేది రాజకీయనాయకులకు మాత్రమే కాదు..రాష్ట్రానికి కూడా..!