`వైల్డ్ డాగ్` ఓటీటీ రిలీజ్ నుంచి థియేటర్ రిలీజ్ కి షిఫ్ట్ అయ్యింది. ఏదైనా సరే, ఓసినిమాని పెద్ద తెరపైచూడడమే మజా! ఓటీటీ ఓ ఆప్షన్ అంతే. అందుకే సినిమా రూపకర్తలు ఓటీటీ రిలీజ్ కంటే థియేటరికల్ రిలీజ్ వైపే మొగ్గు చూపిస్తారు. అది చాలా సహజం. `వైల్డ్ డాగ్` కూడా ఇప్పుడు అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఓటీటీ కి దాదాపు అమ్మేసిన ఈ సినిమాని బయటకు లాక్కురావడం విచిత్రమే. పైగా నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు అగ్రిమెంట్లు పక్కాగా చేసుకుంటాయి. అవన్నీ దాటుకుని, సినిమాని వెనక్కి తెచ్చుకోవడంలో నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రమేయం, ప్రభావం చాలా ఉన్నాయి. ఆయన ఓ లాయర్. కాబట్టి… అగ్రిమెంట్లలోని లూప్ హోల్స్ బాగా కనిపెట్టి, `వైల్డ్ డాగ్` అగ్రిమెంట్లు కాన్సిల్ చేయించారు. ఇక మీదట ఓటీటీ సంస్థలు ఎగ్రిమెంట్ల విషయంలో ఇంకాస్త కఠినంగా వ్యవహరిస్తాయేమో..?
అయితే ఈ నిర్ణయం సముచితమేనా? అనేది పెద్ద ప్రశ్న. ముందే చెప్పినట్టు ఓటీటీ పై కంటే, వెండి తెరపై సినిమా చూడ్డానికే ప్రేక్షకుడు ఇష్టపడతాడు. అది సంప్రదాయకమైన మాధ్యమం. ఆ కోణంలో చూస్తే… వైల్డ్ డాగ్ లాంటి సినిమాలు థియేటర్లో చూడడం సబబే. కాకపోతే.. మార్కెట్ పరంగా ఆలోచిస్తే, ఈ నిర్ణయం అంత సముచితం కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ ఈసినిమాని దాదాపుగా 35 కోట్లకు కొనుగోలు చేయాలనిచూసిందని టాక్. నాగ్ సినిమాకి ఆ స్థాయిలో రిటర్న్ రావడం గొప్ప విషయమే. ఆ మొత్తానికి ఈ సినిమాని అమ్మేస్తే నిర్మాత మంచి లాభాలతో బయటపడినట్టే. నాగ్ సినిమాలు ఈమధ్య బాక్సాఫీసు దగ్గర సరైన ప్రభావం చూపించలేకపోయాయి. ఆఫీసర్, మన్మథుడు 2 డిజాస్టర్ అయ్యాయి. కనీసం వీటికి ఓపెనింగ్స్ కూడా లేవు. `వైల్డ్ డాగ్` కూడా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా కాదు. అదో యాక్షన్ డ్రామా. దానికంటూ సెపరేట్ ఆడియన్స్ ఉంటారు. సినిమా హిట్టయి బాగుంది అనే టాక్ వస్తే తప్ప, ఈ సినిమా క్రౌడ్ పుల్లర్ కాదు. ఓటీటీకి అమ్మేసినా, మిగిలిన శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఉంటాయి. ఏ రకంగా చూసినా.. ఇది మంచి డీలే. అయితే క్రాక్, ఉప్పెన లాంటి సినిమాలకు వచ్చిన వసూళ్లు చూసి నిర్మాతలు ఉత్సాహపడి ఉంటారు. అయితే.. ఇప్పుడు థియేటరికల్ నుంచి.. `వైల్డ్ డాగ్` 36 కోట్లకుపైనే (షేర్) సంపాదించుకోవాలి. అప్పుడే.. ఓటీటీ నుంచి సినిమాని బయటకు తీసుకొచ్చినందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. నాగ్ సినిమా ఆ స్థాయిలో షేర్ తెచ్చుకోవాలంటే.. కనీసం 50 కోట్ల గ్రాస్ సంపాదించాలి. నాగ్ తప్ప… ఈ సినిమాకి పెద్దగా స్టార్ కాస్ట్ లేదు. మరి ఇలాంటప్పుడు 50 కోట్ల మ్యాజిక్ ఫిగర్ నాగ్ కి సాధ్యమేనా? అనేది తేలాల్సివుంది.