ఈమధ్య నాగశౌర్య దగ్గరకు ఓ మంచి కథ వచ్చింది. శివలంక కృష్ణ ప్రసాద్ అనే బడా నిర్మాత ఈ కథని తీసుకొచ్చారు. ఇది ఇద్దరు హీరోల కథ. ఓ పాత్రకు అగ్ర హీరో తప్పనిసరి. కృష్ణ ప్రసాద్ కూ, బాలకృష్ణకూ అవినాభావ సంబంధం ఉంది. ఆదిత్య 369, వంశానికొక్కడు, భలేవాడివి బాసూ, మిత్రుడు లాంటి సినిమాల్ని నిర్మించింది ఆయనే. మిత్రుడుతో బాగా నష్టపోయారు. అప్పట్నుంచి శివలంకకు ఓ సినిమా చేసి ఇవ్వాలని బాలయ్య కూడా అనుకుంటూనే ఉన్నారు. అందుకే ఈ కథ ముందుగా బాలయ్య దగ్గరకే వెళ్లింది. ఈ సినిమాలో నటిస్తా అని బాలయ్య కూడా మాట ఇచ్చాడు. కానీ… తన బిజీ కాల్షీట్ల వల్ల.. కుదరడం లేదు.
ఆ తరవాత.. ఈ కథ నాగార్జున దగ్గరకు వెళ్లింది. నాగ్ కూడా ముందు ఓకే అన్నా, ఇప్పుడు చేయలేని పరిస్థితి. ఎందుకంటే… నాగ్ చేతిలోనూ రెండు ప్రాజెక్టులున్నాయి. ముందుగా…ప్రవీణ్ సత్తారు సినిమాని ఆయన పట్టాలెక్కించాలి. ఆ తరవాత.. `సోగ్గాడే` ప్రీక్వెల్ ఉంది. ఈరెండు సినిమాలూ చేశాకే మిగిలిన సినిమాల వైపు దృష్టి పెట్టాలి. జూన్లో బిగ్ బాస్ ఎలాగూ మొదలైపోతుంది. దానికీ కొన్ని కాల్షీట్లు కావాలి. ఎలా చూసినా, నాగ్ కి ఈ సినిమా చేయడం కుదరడం లేదు. దాంతో బంతి మళ్లీ బాలయ్య దగ్గరే ఆగిందని టాక్. ఎలాగైనా తనకి ఈ సినిమా చేసి పెట్టాలని నిర్మాత కోరుతున్నాడట. నాగశౌర్య కూడా ఈ సినిమా విషయంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు. మంచి కథ మిస్సవ్వకూడదన్నది శౌర్య తాపత్రయం. మరి ఏం జరుగుతుందో?