మంచి కంటే చెడుకు విలవ ఇచ్చే రోజులివి. కొంతమంది పనిగట్టుకుని `బాహుబలి’ చిత్రంపై చెడు ప్రచారం చేయడం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మామూలైపోయింది. బాహుబలి చిత్రానికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి బాహుబలి సినిమా ఇమేజ్ ని దెబ్బతీయాలన్న కొంత మంది కొనసాగించిన కుతంత్రాలు చివరకు మట్టికరిచాయి. చివరకు రాజమౌళి `బాహు’బలే గెలిచింది. ఈ చెడు ప్రచారం బాహుబలి కలెక్షన్స్ ని రవ్వంత కూడా కుదించలేకపోయాయి. పైగా ఈ నెగెటీవ్ ప్రచారంతో బాహుబలి మరింత బలం పుంజుకుందని సినీవర్గాలు చెబుతున్నాయి. పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న ధృడసంకల్పంతో ప్రేక్షకులు థియేటర్ల ముందు బారులుతీరుతూనే ఉన్నారు. రాకెట్ స్పీడ్ తో బాహుబలి కలెక్షన్స్ పైపైకి దూసుకుపోతోంది. మొదటి రోజునే 68 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి భారతీయ చిత్రపరిశ్రమలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా పార్ట్ 1 తీయడానికి వంద కోట్లుకు పైగానే ఖర్చు పెట్టారని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తుంటే ఇప్పటికే (ఆదివారంనాటికే) సినిమా లాభాలబాట తొక్కిఉంటుందన్నది ఓ అంచనా.
రిలీజ్ కి ముందే `తలనొప్పి’ :
బాహుబలి చిత్రంలో శివుడు (ప్రభాస్) ఓ భారీ శివలింగాన్ని భుజాన మోసుకుంటూ వెళ్ళే చిత్రాన్ని మార్ఫింగ్ కు గురిచేసి శివలింగం స్థానే జండూబామ్ సీసాను ఉంచిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షికార్లు కొడుతోంది. ఈ సినిమా చూస్తే మీకు తలనొప్పి రావడం ఖాయమన్న సంకేతం ఆ ఫోటోలో కనిపిస్తోంది. చిత్రమేమంటే ఈ ఫోటో బాహుబలి సినిమా విడుదలకు ముందే (కనీసం 10 గంటల ముందే) సోషల్ మీడియాలో కనిపించడం. ఇదెక్కడి విడ్డూరం… సినిమా రిలీజ్ కాకముందే , సదరు సినిమా ఎలా తీశారో అవగాహన లేకుండానే ఇలా మార్ఫింగ్ ఫోటో పెట్టడంలోనే ఏ స్థాయిలో కుట్ర జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
కాగా, బాహుబలి సినిమాకు పాట రాసిన చైతన్య ప్రసాద్ గారు ఈ ఫోటో చూసి పొగుడుతున్నట్టే పొగిడి తనదైన శైలిలో చురకలంటించారు.
`ఈ పోస్ట్ ఎవరు ప్రచారంలో పెట్టారో గాని నాకు ఆ అజ్ఞాత వ్యక్తి తెగ అంటే తెగ నచ్చేశారు. ఎంచేతంటే…
బాహుబలి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే పాపం కొందరికి కంటి మీద కునుకు లేదు. నిద్ర పోకపోతే ఏమౌతుంది? తలపోటు వస్తుంది. ఆ బాధ తీర్చడానికి జగమేలే జంగమ దేవుడు జండూబామ్ గా మారిపోయాడు. కటకటలాడుతున్న ఆ క్రిటిక్కుల తలపోటు చటుక్కున మానపడానికి ఆ ‘శివుని ఆన ‘ పై ఈ శివుడు జండూబామ్ సీసాను భుజస్కంధాలపై మోసుకు వెళ్తున్నాడు.
అంతే కదా సర్!
సూపర్ అయిడియా!
క్రియేటివిటీ అంటే ఇదీ! చూసి నేర్చుకొండి…..
అంటూ ఆయన చురకలంటించారు.
చెడుకే ప్రాధాన్యం
ఈ మధ్య మీడియా మంచి విషయాలకంటే చెడు విషయాలకే ప్రాధాన్యం ఇవ్వడం మామూలైపోయింది. సమాజానికి ఏమాత్రం మేలు చేయని నెగెటీవ్ వార్తలను గంటలకొద్దీ చూపిస్తూ, మంచి పనులు చేసే వారిని తుంగలో త్రొక్కేయడం ఈ మధ్య టివీల్లో కనిపిస్తున్న తీరుతెన్ను. అదేమని ఎవరైనా పొరపాటున అడిగితే `సెన్సేషన్ లేకపోతే అది వార్త ఎలా అవుతుందండీ…’ అని తలపండిందనుకునే జర్నలిస్టులు అంటున్నారు.
ఆవు పొలంలో పడి అడ్డంగా మేస్తుంటే, దూడ గట్టున తింటుందా- అన్నట్టుగా, పెద్ద మీడియా (టివీలు) దుష్ప్రచారానికి, అబద్ధపు వార్తలకు పట్టం కడుతుంటే సోషల్ మీడియాని అని ఏంలాభం ? పైగా తమ చేతిలో పనేగా అన్నట్టుగా కొందరు బరితగించి చెడును సోషల్ మీడియాల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. కొంతమంది నెగెటీవ్ గా మాట్లాడితేనే గొప్ప అనుకుంటూ ఆ దారినే పోతున్నట్టు అనిపిస్తోంది.
ఇప్పుడు బాహుబలి విషయంలోనూ అదే జరిగింది. అయినా బాహుబలి సినిమా పట్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఉడుత ఊపులకు తాము భయపడేది లేదని దర్శకుడు రాజమౌళి చెప్పకనే చెప్పారు.
ఇప్పటికే ఘన విజయం సాధించిన బాహుబలిని ఇక ఏ శక్తి ఆపలేదన్నది కుళ్లుబోతుదారులు గ్రహిస్తే అంతే చాలు.
– కణ్వస