తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ అభివృద్ధి పనులపై వరుసగా పిటిషన్లు వేస్తూ.. ఆ పనులను ఆలస్యం చేయించడంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పోలవరం అంచనాలపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడం… అమరావతి విషయంలో ప్రపంచబ్యాంక్‌కు ఫిర్యాదు చేయడం లాంటివి మాత్రమే కాదు.. ఏపీలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు, ఎన్టీటీ వంటి వాటిని ఆశ్రయించింది. అలా బోగాపురం విమాశ్రయం విషయంలోనూ… చేసింది. బోగాపురానికి చెందిన ఓ నివాసితురాలు పేరుతో అప్పట్లో ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు అది రివర్స్ అయింది. నిజంగానే ఆ పిటిషన్‌ను విచారణ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విమానాశ్రయాన్ని రివర్స్ టెండరింగ్ చేసి.. జీఎంఆర్‌కే ఇచ్చేసి… కట్టేయడానికి శంకుస్థాపన చేయబోతున్న జగన్ సర్కార్‌కు ఇబ్బంది వచ్చి పడినట్లయింది.
బోగాపురం విమానాశ్రయం పర్యావరణ అనుమతుల విషయంలో మళ్లీ విచారణ జరపాలని ఎన్జీటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఆరోపిస్తూ 2017లో దాట్ల శ్రీదేవి అనే బోగాపురం నివాసి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో విమానయాన మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉండేవారు. బోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలనుకున్నతర్వాత వేగంగా పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతులు కూడా ఇప్పించారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఎన్జీటీలో పిటిషన్లు వేశారు. అయితే అనుమతులు జారీ అయిన 90 రోజుల లోపు పిటిషన్ వేయలేదన్న కారణంగా ఎన్జీటీ… విచారణకు స్వీకరించలేదు. దీనిపై శ్రీదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
శ్రీదేవి పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. పర్యావరణాన్ని తిరిగి మార్చలేని విధంగా చేసే ప్రమాదం ఉంటుందని.. ఇలాంటి కేసుల్లో స్వతంత్ర ట్రైబ్యునల్ జ్యూడిషియల్ కోణంలో ఆలోచించడం అవసరం అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌తో పాటు ఇతర పార్టీలు హాజరయి వాదనలు వినిపించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టప్రకారం పరిష్కరించాలని ఎన్జీటీకి ధర్మాసనం సూచించింది. పర్యావరణ అనుమతులపై దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ.. విచారణ జరిపి ఎన్జీటీ నిర్ణయం తీసుకునేవరకూ బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం పనులు ప్రారంభించడం సాధ్యం కాదు
గతంలో అమరావతి విషయంలోనూ కొంత మంది వైసీపీ సానుభూతిపరులుఎన్జీటీని ఆశ్రయించారు. కొండవీటి వాగుముంపు ఉందని … వారి వాదన. అందుకే అప్పట్లో ఏపీ సర్కార్.. శరవేగంగా కొండవీటి వాగు ముందు నివారణ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. దీంతో ఎన్జీటీ అమరావతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోగాపురానికి కూడా అలా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.