ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తలుగుతున్నాయి. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని.. బలవంతపు ఏకగ్రీవాలు చేసిన చోట మళ్లీ నామినేషన్లకు అంగీకరించడంపై ప్రభుత్వం వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని .. ఫోన్లను సేఫ్ కస్టడీలోకి తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. అలాగే… బలవంతపు ఏకగ్రీవాలు అయిన చోట .. కలెక్టర్ సిఫార్సుల మేరకు.. రీ నామినేషన్లకు అవకాశం కల్పించారు. ఆ నిర్ణయాన్ని కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో కొన్ని చోట్ల ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. అవి పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు.
ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీదే అంతిమ నిర్ణయం అనిచెబుతున్నప్పటికీ.. ప్రభుత్వం ఎస్ఈసీ నిర్ణయాలపై వరుసగా కోర్టుల్లో లంచ్ మోషన్ పిటిషన్లు వేస్తోంది. హైకోర్టు కూడా … మధ్యేమార్గంగా నిర్ణయాలు తీసుకుంటామని చెబుతూ… నిర్ణయాలు ప్రకటిస్తోంది. ఈ మేరకు అనేక విధాలుగా ప్రభుత్వం ఎస్ఈసీ నిర్ణయాలను అడ్డుకోగలిగింది. వాలంటీర్ల వ్యవహారంపై తీవ్రమైన ఫిర్యాదులు వచ్చినా.. ఓటర్లను బెదిరిస్తున్నారని ప్రభుత్వ పథకాలు ఆపేస్తున్నారని ఆరు వందల ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఈసీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎస్ఈసీ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.
ఎస్ఈసీ జారీ చేసే ప్రతి ఉత్తర్వులోనూ తాము హైకోర్టు ఆదేశాల ప్రకారమే.. జారీ చేస్తున్నామని చెబుతూ వస్తున్నారు. ఉత్తర్వుల్లో ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నారు. ఎస్ఈసీకి ఉన్న అధికారాలు.. రాజ్యాంగ సంస్థకు ఉన్న అధికారాల సెక్షన్లను కూడా ఉదహరిస్తూంటారు. అయినా కోర్టులో ఆయనకు సానుకూల ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వ వాదనే నెగ్గుతోంది.