శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం `శ్రీకారం`. ఈనెలలోనే విడుదల అవుతోంది. ఇది రైతు కథ. ఈమధ్య కాలంలో రైతు నేపథ్యంలో సాగిన కథలు చాలా వచ్చాయి. `మహర్షి`లోనూ మహేష్ బాబు రైతుల గురించే మాట్లాడాడు. ఆ కథకీ, ఈ కథకీ లింకు ఉందని, రెండు కథలూ ఒకేలా సాగుతాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర రచయిత సాయిమాధవ్ బుర్రా స్పందించారు. `మహర్షి`, `శ్రీకారం` వేర్వేరు కథలని, అయితే రెండూ.. రైతుల గురించే మాట్లాడాయని, మహేష్ బాబు రైతుల గురించి మాట్లాడితే, శర్వా చెప్పకూడదా? అని సూటగా ప్రశ్నించారు. రైతుల గురించి అందరూ మాట్లాడాలి, అందరూ మాట్లాడుకోవాలి.. మా కథలో కూడా రైతు సమస్యల గురించి మాట్లాడాం అన్నారాయన.
“ఈ సమాజానికి అవసరమైన కథ ఇది. చాలా శక్తిమంతమైన సంభాషణలు రాసే అవకాశం దక్కింది. మనందరిలోనూ మనకు తెలియకుండానే ఓ రైతు ఉన్నాడు. మన డీఎన్ఐలో రైతు ఉంటాడు. యువతరం వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పే కథ ఇద”న్నారు. బుర్రా సాయిమధవ్ దర్శకుడిగా మారతారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ఆయన స్పందించారు. “నేను చాలామంది దర్శకుల దగ్గర పనిచేయాలి. చాలా కథలు రాయాలి. నేను చెప్పాలనుకున్న కథ.. నా నుంచి పుడితే… తప్పకుండా దర్శకుడ్ని అవుతా. అప్పటి వరకూ ఆ ఆలోచన రాద“న్నారు.