టాలీవుడ్ లో బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది. కాస్త నేమూ, ఫేమూ ఉన్నవాళ్లెవరు? వాళ్ల జీవితాల్లో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయా? అనే విషయంపై దర్శకులు ఫోకస్ చేస్తున్నారు. అవకాశం ఉంటే… బయోపిక్ కి సై అంటున్నారు. తాజాగా ఓ సీనియర్ దర్శకుడి దృష్టి.. సౌందర్య కథపై పడింది. టాలీవుడ్ లో మకుటం లేని మహారాణిలా వెలిగింది సౌందర్య. సావిత్రి తరవాత.. అంతటి పేరు, ఖ్యాతి తెచ్చుకున్న నటి సౌందర్యనే. సంసార పక్షమైన పాత్రలు ఎంచుకుంటూ, ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం ఈ జనరేషన్‌కి సాధ్యం కాదేమో.? ఓ తరానికి సౌందర్య కలల రాణి. ఇప్పుడు తన కథని వెండి తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నార్ట.
అయితే సౌందర్య కథలో గొప్ప మలుపులేం ఉండవు. చాలా ఫ్లాట్ గా ఉంటుంది. అయితే ఈ విషయాన్ని దర్శకుడు ఒప్పుకోవడం లేదు. తన కథలో తెలియని విషయాలెన్నో ఉన్నాయని, అవి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాయని చెబుతున్నాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతోందని సమాచారం. కాకపోతే సౌందర్య పాత్ర పోషించగల సమర్థవంతమైన నటి ఎవరన్నది ప్రశ్నార్థకం.