తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితిని మార్చేస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వైఫల్యాలను.. ధరల పెంపుదలను.. అలాగే.. తెలంగాణకు చేస్తామని చెప్పి చేయని అంశాలను కేటీఆర్ హైలెట్ చేస్తున్నారు. కేంద్రానికి లేఖలు రాయడం.. విమర్శలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇటీవల కేటీఆర్ ప్రధానంగా ఐటీఐఆర్ ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారు. ఐటీఐఆర్‌ను హైదరాబాద్‌కు గతంలో కాంగ్రెస్ కేటాయించింది. విభజన సమయంలో దీన్ని ఇచ్చింది. ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కేంద్రం అమలు చేస్తే.. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలతో పాటు మౌలిక వసతుల కోసం వేల నిధులు వచ్చేవి. అయితే.. బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత అందులో అడుగు ముందుకు పడలేదు. టీఆర్ఎస్ ఇంత వరకూ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోలేదు కానీ.. ఇప్పుడు మాత్రం కేటీఆర్ హైలెట్ చేస్తున్నారు.
రాష్ట్రానికి ఐటీఐఆర్‌ను తేలేని బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్‌ను మూలకు పెట్టింది బీజేపీ ప్రభుత్వమేనని .. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటన కూడా చేశారని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ ఐటీఐఆర్‌పై విమర్శలు చేస్తూండటంతో … తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ .. అసలు ఐటీఐఆర్ రాకపోవడానికి టీఆర్ఎస్ సర్కారే కారణం అని మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపించారు. దీనికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సొంత పార్టీ మంత్రి ప్రకటనపై సమాచారం లేకపోవడం.. బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఐటీఐఆర్ ముందుకెళ్లలేదు.. కర్ణాటకలో ఐటీఐఆర్ రాకపోవడానికి కూడా తామే కారణమా అని ప్రశ్నించారు.
2014 నుంచి రాసిన లేఖలు, డీపీఆర్‌లు బండి సంజయ్‌కు ఇస్తాం.. ఐటీఐఆర్‌ను తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని కేటీఆర్ సవాల్ చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు కూడా స్పందించారు. కేటీఆర్ అసత్యాలతో బీజేపీపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అటు బీజేపీ.. ఇటు టీఆర్ఎస్ రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో విమర్శలు, ప్రతి విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి.