అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో కథానాయకుడు సుమంత్. గోదావరి, సత్యం లాంటి సినిమాలతో.. ఓ ముద్ర వేశాడు. అయితే ఓ హిట్టు కోసం గత కొన్నేళ్లుగా విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. జోనర్లు మార్చినా, గెటప్పులు మార్చినా.. ఫలితం ఉండడం లేదు. తాజాగా కపటధారి అనే సినిమా విడుదలైంది. కన్నడలో విడుదలైన కలువధారి అనే చిత్రానికి రీమేక్ ఇది. ఆల్రెడీ ఓ చోట బాగా ఆడిన సినిమా కాబట్టి.. మినిమం గ్యారెంటీ ఉంటుందనుకున్నారంతా. పైగా ఈమధ్య క్రైమ్ డ్రామా కథలకు మంచి డిమాండ్ ఉంది. దాంతో…. ఎన్నో కొన్ని వసూళ్లు వస్తాయనుకున్నారు. కానీ తొలి షోకే.. ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దాంతో పాటు ఓపెనింగ్స్ ఏమాత్రం లేవు. ఈ సినిమాని సగటు ప్రేక్షకుడు పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. సినిమా వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయింది. మొత్తంగా ఈసినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 35 లక్షల షేర్ వచ్చిందట. కనీసం 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది. అందులో 20 శాతం కూడా వెనక్కి రాకపోవడం నిర్మాతల్ని నిరాశలో పడేసింది. థియేటరికల్ రిలీజ్ కి ముందు `కపటధారి`కి ఓటీటీ ఆఫర్లు బాగానే వచ్చాయి. ఓటీటీకి ఇచ్చేసినా – ఇంతకంటి మంచి మొత్తమే లభించేది.