కమ్యూనిస్టులు అంటే కరుడుగట్టిన హేతువాదులు. వారు వాస్తవిక వాదాన్నే నమ్ముతారు. మానవత్వాన్ని.. మంచిని నమ్ముతారు కానీ.. దేవుళ్లను కాదు. ఇలాంటి భావజాలం ఉన్న వారే కమ్యూనిస్టులు అవుతారు. ఆ పార్టీల్లో పై స్థాయికి వెళ్లిన వారంటే మరింత కరుడు గట్టిన భావజాలంతో ఉన్న వారుంటారు. సీపీఐ పార్టీలో నారాయణ ఉన్నత స్థానానికి ఎదిగారు. కానీ ఆయన మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. విశాఖలో ప్రచారం చేస్తూ నేరుగా శారదా పీఠానికి వెళ్లిపోయారు. భక్తుడిగా ముకుళిత హస్తాలతో శారదా పీఠం స్వరూపానందకు నమస్కారం చేశారు.
ఆయన శాలువా కప్పితే కప్పించుకున్నారు. మీరు అడిగితే అన్ని పార్టీలను గెలిపిస్తారంట కదా.. సీపీఐని కూడా గెలిపించాలని కోరారు. దానికి స్వరూపానంద ఏమని చెప్పి ఉంటారో కానీ.. తాను వైసీపీని గెలిపించడానికి ఇప్పటికే యాగాలు.. చేసేశానని మనసులో అనుకుని ఉంటారు. సీపీఐ నారాయణ ఇలా శారదాపీఠానికి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇలాంటి పనులు చేయబట్టే.. ఆయన మాటలు, చేతలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని.. అది సీపీఐ ఉనికికే ఇబ్బందికరంగా మారుతోందని మండిపడుతున్నారు.
అయితే సీపీఐ నారాయణ మాత్రం.. ఇలాంటి వాటిని పట్టించుకోరు. సందర్భం వచ్చినప్పుడు.. తాను ముకుళిత హస్తాలతో మనస్కారం చేసిన స్వరూపానందను దొంగ స్వామి అని తిట్టేయగలరు. వైసీపీ ఆస్థాన స్వామిజీగా పేరు తెచ్చుకున్న స్వరూపానందను కలవాలని కమ్యూనిస్టు నేత అనుకోవడమే విచిత్రం అయితే… వెళ్లి నమస్కారం చేసుకుని రావడం మరింత విడ్డూరం. ఇవన్నీ సీపీఐ నారాయణకు మాత్రమే సాధ్యం.