వకీల్ సాబ్ ప్రమోషన్లలో భాగంగా… ఇది వరకు `మగువ మగువ` పాటని విడుదల చేసింది చిత్రబృందం. పింక్ సినిమాకి ఇది రీమేక్. `పింక్` అనేది అమ్మాయి కథ. దానికి తగ్గట్టుగానే వాళ్ల కోణంలో, వాళ్ల కోసం సాగిన పాట అది. కానీ ఇది `పవన్` సినిమా. తన ముద్ర తప్పకుండా ఉండాలి. తన ఫ్యాన్స్ ని సంతోష పెట్టే విషయాలు పొందుపరచాలి. దాన్ని గమనించిన చిత్రబృందం ఈరోజు `సత్యమేవ జయతే` అనే మరో గీతాన్ని విడుదల చేసింది. ఈ పాటలో కథానాయకుడి వ్యక్తిత్వం చెప్పే ప్రయత్నం చేసింది. `వకీల్ సాబ్` అనే లోగో లేకపోతే.. కచ్చితంగా ఇది పవన్ పొలిటికల్ క్యాంపెనియింగ్ కోసం రాసిన పాటలానే అనిపిస్తుంది. పవన్ నైజాన్ని, జనంలో ఉన్న తన ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తూ సాగిన గీతంలా వినిపిస్తుంది.
జనజనజన జనగణమున కలగలిసిన జనం మనిషిరా
మనమనమన మనతరపున నిలబడగల నిజం మనిషిరా
నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడుగా
పడి నలిగిన బతుకుల కొక బలమగు భుజమివ్వగలడురా…
అంటూ మొదలైన గీతంలో.. హీరోయిజం పుష్కలంగా రంగరించారు.
గుండెతో స్పందిస్తాడు, అండగా చేయ్యిందిస్తాడు,
బలహీనులందరి ఉమ్మడి గొంతుక.. పోరాటమే తన కర్తవ్యం… ఇవన్నీ – పొలిటికల్ మైలేజీ కోసం రాసిన పదాలుగా అనిపిస్తాయి. అయినా సరే, ఫ్యాన్స్కి నచ్చేస్తాయి.
ఈ సినిమాలో హీరో వకీల్. కాబట్టి.. దానికి తగ్గ లిరిక్స్ కూడా కుదిరాయి
వకాల్తా పుచ్చుకుని వాదించే వకీలు
పసేదోళ్ల పక్క నుంచి కట్టిస్తాడు బాకీలు
బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు
మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు – అంటూ ర్యాప్ కూడా కలిసింది.
శంకర్ మహదేవన్ తనదైన శైలిలో పాడిన ఈ గీతాన్ని రామజోగ్య శాస్త్రి రచించారు. మొత్తానికి ధియేటర్లో ఈ పాట మోతెక్కించేలోగా.. జనసేన ప్రచార గీతంగా వర్థిల్లడం, గట్టిగా వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది.